calender_icon.png 20 March, 2025 | 5:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇది 40 శాతం కమీషన్ల బడ్జెట్

20-03-2025 01:10:37 AM

అన్ని వర్గాలకు అన్యాయమే: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయమే జరిగిందని, తెలంగాణ ప్రజలకు దక్కింది గుండు సున్నాయేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కేటాయింపుల్లో ప్రతి రంగానికి అన్యా యం చేశారని, ఆరు గ్యారెంటీలతో పాటు ఎన్నికల హామీలకు మంగళం పాడారని ధ్వజమె త్తారు.

ఈ బడ్జెట్ రేవంత్‌రెడ్డి అసమర్థతకు, చేతకానితనానికి, పరిపాలన వైఫల్యానికి నిలువుట ద్దమని మండిపడ్డారు. ఇది 40 శాతం కమీషన్ల కాంగ్రెస్ బడ్జెట్ అని, ఇచ్చిన మాటకు కాకుండా ఢిల్లీకి మూటలు పంపడంపైనే దృష్టిసారించారని ఆరోపించారు. ప్రజల కష్టాలపైన ధ్యాసలేని బడ్జెట్ అని, ప్రజాధానాన్ని పార్టీకి పంచిపెట్టే కుట్ర అని వాపోయారు.

ఆటో డ్రైవర్ నుంచి మొదలుకొని అన్నదాత దాక అందరికి మోసమేనని, ఇది ట్రిలియన్ డాలర్ల అప్పు టార్గెట్‌గా ఉన్న బడ్జెట్ అని, ఈ ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో పేదలు, ఆడబిడ్డలు, రైతులు ఎంతో ఆశతో ఎదురుచూశారని కానీ భట్టి విక్రమార్క గంటన్నరపాటు చదివిన ఉపన్యాసంలో ఆరు గ్యారెంటీలు గోవిందా.. గోవిందా అని అర్థమైందన్నారు.

రూ.4 వేల పెన్షన్ వస్తుందని ఎదురు చూసిన వృద్ధులకు, రూ.2,500 వస్తాయనుకున్న మహిళలకు నిరాశే మిగిలిందని, తులం బంగారానికి దిక్కే లేదన్నారు. ఉచిత బస్సు  ప్రయాణంతో 100 మందికి పైగా ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని, వారికిచ్చిన సంక్షేమ బోర్డుపై అతీగతి లేదని కేటీఆర్ ఆరోపించారు.

అంబేద్కర్ అభయహస్తం పేరుతో దళితులకు రూ.12 లక్షలు ఇస్తామన్న హామీ మరిచిపోయారన్నారు. ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ చేస్తామని చెప్పుకుంటున్న వారికి.. ట్రిలియన్‌లో ఎన్ని సున్నాలుంటాయో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ప్రభుత్వం అందాల పోటీలను పెడుతుందని మండిపడ్డారు.