calender_icon.png 5 November, 2024 | 11:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమా ఇది

14-08-2024 12:05:00 AM

డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. రవితేజ.భాగ్యశ్రీ బోర్సే నాయకానాయికలుగా నటించిన ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్ నిర్మించగా, ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ హరీశ్ శంకర్ మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలివీ... 

‘మిస్టర్ బచ్చన్’కు ‘ది ఓన్లీ హోప్’ అనే ట్యాగ్‌లైన్ పెట్టారు కదా.. స్పెషాలిటీ ఏమిటి?

-ఇందులో హోప్ హీరో క్యారెక్టరైజేషన్. ఈ సినిమా చేయడానికి రీజనే హానెస్టీ ఉన్న హీరోయిజం. ఇదొక ట్రూ ఇన్సిడెంట్. 80 శాతం నార్త్ ఇండియాలో జరిగింది. సినిమాటిక్ లిబర్టీ తీసుకొని చేసిన కథ. ఆ రోజుల్లో లక్షల రూపాయల లంచం ఇస్తామని ఆఫర్ చేసినా సరే ఓ ఆఫీసర్ ఎక్కడా లొంగలేదు. నాకు ఆ పాయింట్ చాలా నచ్చింది. -‘రైడ్’ మూవీకి, ఈ సినిమాకు అజయ్ దేవగన్‌కి రవితేజకి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది. ‘-రైడ్’ కాస్త సీరియస్‌గా ఉంటుంది. కానీ ఈ సినిమా రవితేజకు తగ్గట్టు ఉంటుంది. నిజాయితీ గల వ్యక్తుల ప్రేమలో, ఫైట్‌లో నిజాయితీ ఉంటుంది. ఆ నిజాయితీ పాయింట్ నుంచే అన్నీ వచ్చాయి.  

ఈ సినిమాలో రవితేజను ఎలా చూపించబోతున్నారు?

మనం మర్చిపోయిన జ్ఞాపకాలను గుర్తు చేస్తూ.. మనకు గుర్తున్న జ్ఞాపకాలను చూపిస్తూ, రవితేజ నుంచి ఏం ఆశిస్తారో అలాంటి ఎలిమెంట్స్‌తో సినిమాను తీర్చిదిద్దాం. -సెకండ్ హాఫ్‌లో రవితేజ పెర్ఫార్మెన్స్ చూసి చాలా కొత్తగా ఫీలవుతారు. ఐటీ ఆఫీసర్‌కు సూట్ అయ్యేలా రవితేజ తనను మలచుకున్నారు, రవితేజకు సూట్ అయ్యేలా మేము కథను మలుచుకున్నాం. రెండూ బ్యాలెన్స్ చేశాం. -నేను బీహెచ్‌ఈఎల్‌లో పెరిగా. అక్కడ ఓ మంచి లవ్‌స్టొరీ తీయాలని ఎప్పటినుంచో కోరిక ఉన్నా, నాకున్న మాస్ ఇమేజ్ వల్ల కుదరలేదు. ఈ సినిమాతో ఆ కోరిక కొంత వరకు తీరింది. 

హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే ఎంపిక గురించి చెప్పండి.. 

-90స్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక వీధిలో జిక్కీ అనే అమ్మాయి ఉండాలి అన్నప్పుడు.. ఆ అమ్మాయికి గత సినిమాల ఇమేజ్ ఉండకూడదని కొత్త అమ్మాయిని తీసుకున్నాం. భాగ్యశ్రీ అద్భుతంగా నటించింది. 

జగపతిబాబు డ్యూయెల్ రోల్ చేశారా?

-లేదండి, సింగిల్ రోలే.. ఎంపీగా కనిపిస్తారు.

నాలుగు ఫైట్లు మాస్ ఆడియన్స్‌ను ఆకర్షిస్తాయంటారా? 

నాలుగు ఫైట్లే పది ఫైట్ల ఇంపాక్ట్ ఇస్తాయి. రవితేజ హీరో అంటే మాస్‌తోపాటు ఫ్యామిలీస్ కూడా చూస్తారు. ఈ సినిమా పూర్తి ఎంటర్‌టైనర్. 

మీ సినిమాల్లో పాటలు సూపర్ హిట్ అవుతాయి..  బచ్చన్ సాంగ్స్ అంతే! మిక్కీతో వర్క్ ఎలా ఉంది? 

డైరెక్టర్‌గా కొన్ని సార్లు నేను విఫలమైనా నా పాటలు ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. ఆదిత్య మ్యూజిక్ వారు ‘హరీశ్ శంకర్ హిట్స్’ అని క్యాసెట్ రిలీజ్ చేయడానికి కారణం అదే. నాకు మొదటి నుంచి పాటలు చాలా ఇష్టం. మిక్కీ చాలా మితభాషి. మా ఇద్దరి కాంబినేషన్ బాగా మ్యాచ్ అయ్యింది. మ్యూజిక్ అంతా వన్ వీక్‌లో చేశాం. వారంలో నాలుగు చార్ట్ బస్టర్ ట్యూన్స్ ఇవ్వడం మామూలు విషయం కాదు. 

ఈ ప్రాజెక్టు త్వరగా కంప్లీట్ చేయడంలో నిర్మాత సహకారం?

-విశ్వప్రసాద్ లేకపోతే ఈ సినిమా ఇంత గ్రాండ్‌గా వచ్చేది కాదు. మార్కెట్, ఫైనాన్సియల్ ఈక్వేషన్స్‌తో సంబంధం లేకుండా మేము అడిగిన దానికంటే ఎక్కువే ఇచ్చారాయన. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చేస్తునప్పుడు కల్యాణ్ ఎలక్షన్లలో బిజీ అయ్యారు. ఎన్నికల ప్రచారం నుంచి ఫలితాల  వరకూ ఈ సినిమా పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేశాం. 

చివరగా.. ‘మిస్టర్ బచ్చన్’ గురించి ఆడియన్స్‌కి ఏం చెప్తారు?

మళ్లీ మళ్లీ చూసేలా ఉంటుంది.. కచ్చితంగా రిపీట్ ఆడియన్స్ వస్తారు. -ఆగస్ట్ 14 సాయంత్రం ఏడు గంటల నుంచి ప్రిమియర్స్ ఉంటాయి. 15న సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది.