03-03-2025 01:28:08 AM
సిరిసిల్ల, మార్చి 2 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్నది కాలం తెచ్చిన కరువు కాదని, కేవలం కాంగ్రెస్ తెచ్చిన కరువని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆదివారం సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డలో జరిగిన కుట్రపూరిత ప్రమాదాన్ని సాకుగా చూపి, కేసీఆర్‌పై ఉన్న కోపంతో రాష్ట్రవ్యాప్తంగా పంటలు ఎండిపోయేలా రేవంత్ సర్కార్ కుట్రపన్నిందని వాపోయారు.
సిరిసిల్ల, తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లో సాగునీరు లేక వ్యవసాయం సంక్షోభంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు సాగునీరు అందక తాము పడుతున్న బాధలను కేటీఆర్‌కు వివరించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకొచ్చి మల్కపేట రిజర్వాయర్‌లోకి వదిలితే, దేవునిగుట్ట తండాలో రైతులు సాగు చేసేవార ని, మేడిగడ్డ పర్రెను మరమ్మతు చేయించి నీళ్లు ఇవ్వొచ్చని పేర్కొన్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఎర్రటి ఎండల్లో కూడా అప్పర్ మానేరు, మిడ్ మానేరు ద్వారా వాగులు, చెరువులు నింపి రైతులను కాపాడామన్నారు. ఇప్పుడు సిరిసిల్ల జిల్లాలో వందల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని, చూస్తూ ఊరుకోమన్నారు. వచ్చే 48 గంటల్లో నీళ్లు విడుదల చేయకపోతే సంబంధిత శాఖ మంత్రి చాంబర్ ఎదుట ధర్నాకు దిగుతామని కేటీఆర్ హెచ్చరించారు.
కేసీఆర్‌పై కోపముంటే రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప, రైతులను గోస పెట్టడం సరికాదన్నారు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్‌లో ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదన్నారు. రైతుబంధును కూడా ఇవ్వడం లేదని, ఈ ప్రభుత్వానికి కరెంట్, నీళ్లు ఇచ్చే తెలివి లేదన్నారు. ప్రస్తుతం మిడ్‌మానేరులో 16 టీఎంసీల నీళ్లు ఉన్నాయని, ఒక్క టీఎంసీ నీటిని మల్కపేట రిజర్వాయర్‌కు విడుదల చేస్తే ఈ ప్రాంతంలోని రైతులు వ్యవసాయం చేయడానికి సరిపోతుందన్నారు.
తాగునీటికి 3 టీఎంసీలు మినహాయించినా ఇంకా 13 టీఎంసీలు మిగులుతాయని తెలిపారు. సాగునీళ్లు విడుదల చేయకపోతే, అన్నదాతలతో కలిసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాయకులు ఉన్నారు.