calender_icon.png 26 April, 2025 | 3:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్కికీ వీడికి ఏ సంబంధమూ లేదు!

26-04-2025 12:00:00 AM

‘భయంతో, ఆకలితో చద్దామా..? లేదంటే పోరాడి చద్దా మా..! అనేది మన చేతుల్లోనే ఉంది’ అనే డైలాగ్‌తో మానవుడు తన మనుగుడ కోసం సాగించే పోరాటమే ‘కలియుగమ్ 2064’ సినిమా అని అర్థమవుతోంది. ‘కల్కికి వీడికీ ఏ సంబంధమూ లేదు.. వాడ్ని వదిలెయ్’ అంటూ కథానాయకి శ్రద్ధాశ్రీనాథ్ చెప్పే మరో డైలాగ్ సినిమాపై ఆసక్తి పెంచేలా చేసింది. శ్రద్ధాశ్రీనాథ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సైన్స్ ఫిక్సన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ చిత్రమే ‘కలియుగమ్2064’.

ఇందులో కిశోర్, ఇనియన్ సుబ్రమణి, హ్యారీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఆర్‌కే ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కేఎస్ రామకృష్ణ నిర్మిస్తున్నారు. ప్రమోద్ సుందర్ దర్శకత్వంలో ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ సినిమా మే 9న తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రి డిస్ట్రిబ్యూషన్ సంస్థ విడుదల చేస్తోంది.

విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను టాలీవుడ్ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ చేతుల మీదుగా లాంచ్ చేయించారు. ట్రైలర్ విషయానికి వస్తే.. భవిష్యత్తులో ముఖ్యంగా 2064లో వచ్చే విపత్కర పరిస్థితుల్లో మనుషులు మనుగడ కోసం చేసే పోరాటాన్ని ప్రధానంగా చూపించారు.

ఆహారం, నీరు, మానవత్వం కరువైనప్పుడు విచక్షణా జ్ఞానం కోల్పోయి మనుషులు ఎలాంటి ఘోరాలకు పాల్పడ్డారు? అనే థీమ్‌తో కలియుగంలోని పౌరాణిక ఇతివృత్తాలను గుర్తుచేస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికి డీవోపీ: కే రామ్‌చరణ్; సంగీతం: డాన్ విన్సెంట్; ఎడిటర్: నిమల్; ఆర్ట్: శక్తి వెంకట్రాజు.