calender_icon.png 6 November, 2024 | 1:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ జనరేషన్ మ్యాజిక్ చేస్తోంది!

22-04-2024 12:10:00 AM

బెంగాలీ రచయిత, సంపాదకుడు, ప్రచురణకర్త - శమిక్ బంధోపాధ్యాయ

 నాటకం  అనగానే ఏ పౌరాణికాలనో, జానపదనాటకాలనో ఊహించుకునే రోజులు పోయాయి కదా. ఇప్పుడంతా అబ్స్ట్రాక్ట్ ఆధునికతని సంతరించుకున్న కథలదే రాజ్యం. రెండు మూడు భాషలు కలిపి, ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులను మేళవించిన కొత్తతరపు ఆవిష్కరణ.  ‘శూద్రక హైదరాబాద్‘ పేరుతో శొప్న్ మండల్ నిర్వహించే థియేటర్ ఆర్ట్స్ అకాడెమీతో కలిసి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా నిర్వహించిన ‘ఎక్స్‌ప్రెషన్- మల్టీలింగువల్ ఫెస్టివల్‘లో అలరించిన ఈ తరం యువకళాకారుల సందడికి, కొత్త ఉత్సాహానికి ఇంకొక కారణం శమిక్ బంధోపాధ్యాయ. 

బెంగాలీ రచయితా, కళాకారుడూ శమిక్ బంధోపాధ్యాయ హైదరాబాద్ వచ్చి ఇక్కడ జరుగుతున్న నాటకాల జాతరని చూసి మురిసిపోయారు. బెంగాల్ అనగానే  సాహిత్యం గుర్తుకు వస్తుంది. రవీంధ్రనాథ్ ఠాగూర్, సత్యజిత్ రే, మహాశ్వేతాదేవి లాంటి సాహిత్య, కళాజీవులు గుర్తొస్తారు. మండుతున్న నాలుగు మాటలని చైతన్యంగా మార్చే నినాదాలు గుర్తుకు వస్తాయి. అలాంటి భూమితో హైదరాబాద్ అనుబంధం కూఅడా తక్కువదేమీ కాదు. మూడు లక్షలకు పైగా బెంగాలీలు హైదరాబాద్‌లో  ఉంటున్నారు. అందుకే ఈ బెంగాలీ తెలంగాణ కలయికల కొత్తతరం ఫ్యూజన్ (తెలుగు, బెంగాలీ, హిందీ భాషలు కలిసిపోయి) నాటకం బాగా ఆకట్టుకుంది.  ఈ సందర్భంగా శమిక్ బందోపాధ్యాయతో నాలుగు మాటలు.

ఈ ఫ్యూజన్ నాటకం మీకు ఎలా అనిపించింది? 

ఇది చాలా అవసరమైన మార్పు. రెండు భాషలని కలపటం అంటే రాష్ట్రాల, సంస్కృతుల మధ్య ఉండే అంతరాలని చెరిపివేసే ప్రయత్నం. కళకి భాష ఉండదు అని చెప్పుకోవాల్సిన సందర్భంలో ఇది ఒక కొత్త అడుగు అనుకుంటున్నాను. నిజానికి ఇదే మొదటి సారి కాదు. ఇలాంటి ప్రయోగాలు ఫారిన్ థియేటర్స్ లో జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మనదగ్గర కూడా మొదలు కావటం ఆనందంగా ఉంది.  

నాటకం ద్వారా మనం భాషల మధ్య అంతరాలని చెరపగలమా? 

నాటకం అనే ప్రక్రియ ఇప్పుడు మొదలైంది కాదు. ఇది క్రీస్తు పూర్వం నుంచీ ఉంది కదా. గ్రీకు నాటకాలని మనం ఎన్నో విన్నాం. వాటి ద్వారా అక్కడి చరిత్రని, ఆనాటి రాజుల నిరంకుశత్వ పాలనా ఎలా ఉండేవన్న విశయంలో ఒక అవగాహనకు వచ్చాం. ఒక పుస్తకం కంటే నాటకం మరింత బలంగా ప్రజల్లోకి వెల్లగలిగిన మాధ్యమం. ఒక భాషనుంచి మరొక భాషకి నాటకాన్ని మార్చినప్పుడు ఆయా ప్రాంతాల సంస్కృతులు కూడా వేరే ప్రాంతాలకు చేరగలుగుతాయి. ఆ ప్రాంతాల కట్టు, బొట్టు, మాట్లాడే తీరు, బాడీ లాంగ్వేజ్ లాంటివి తెలియని వారికి పరిచయం అవుతాయి. ఇది ప్రజల మధ్య దగ్గరితనానికి దారి వేస్తుంది. 

ప్రేక్షకుల స్పందన ఎలా అనిపించింది? ’

నిజానికి ఇక్కడ వేసిన అన్ని నాటకాల్లోనూ కొత్తదనం ఉంది, ఆడిటోరియంలో మంచి టెక్నికల్ విలువలున్నాయి. ఈ ఆర్టిస్టుల్లో ఉన్న డెడికేషన్ నచ్చింది. అయితే ప్రేక్షకుల సంఖ్య మరికొంత పెరగాల్సింది. రెండువందల మందికంటే ఇంకా ఎక్కువ ప్రేక్షకులకు అందాల్సిన కంటెంట్ ఇది. థియేటర్ ప్లేకి మరింత ఆదరణ ఉండాలనిపించింది. హైదరాబాద్‌కు  సాంస్కృతిక చరిత్ర ఉంది. కళా సృజన జరగటానికి, ప్రజా కళలు విస్తరించటానికి అవసరమైన అన్ని పరిస్థితులూ ఉన్నాయి. నిజానికి బెర్లిన్, లండన్ లాంటి అంతర్జాతీయ నగరాల స్థాయిలో, ముంబై, కలకత్తా లాంటి నగరాల స్థాయిలో అయినా థియేటర్లు ఉండాల్సింది.  

థియేటర్ ప్లేలో మీరు గమనించిన మార్పులేమైనా ఉన్నాయా? 

కొత్తగా ఎలాంటి మార్పులు వస్తే బాగుండనుకుంటున్నారు? 

చాలా మార్పులు జరిగాయి. ఒకప్పటి నాటకాలు వేరు ఇప్పుడు కొత్త తరం చేస్తున్న నాటకాలు వేరు. ఇదంతా ఇప్పటి జనరేషన్ చేస్తున్న మ్యాజిక్. ఒకప్పటి భాష ఇప్పుడు లేదు. ఒక నాటి నేపథ్య సంగీతం ఇప్పుడు లేదు. వెస్ట్రన్ థియేటర్లలో గమనించినట్టయితే మీరు షేక్స్‌పియర్ నాటకాన్ని ఇప్పుడు వెళ్ళి చూస్తే ఆశ్చర్య పోతారు. ఆ నాటి పాత్రలు మాట్లాడిన భాష మారింది, మొహాల్లో చూపించే ఎక్స్‌ప్రెషన్ మారింది. ఇప్పటి కళాకారులకి తమ ప్రేక్షకులకి ఏది అవసరమో బాగా తెలుసు. మన వాళ్లలోనూ కొత్త కొత్త ఆలోచనలతో, కాన్సెప్ట్‌లతో వస్తున్నారు. 

అలాంటి మార్పు మనదగ్గర వచ్చే అవకాశం ఉందా? 

అదే కదా ఇపుడు జరుగుతున్నది. మల్టీ లాంగ్వేజ్ అనే ఆలోచనతో ఒకే ప్లేలో వివిధ భాషల నటులు కలిసి ఒక నాటకాన్ని వేస్తున్నారు. దాన్ని రెండు భాషల ప్రేక్షకులు ఎలాంటి ఇబ్బందీ లేకుండా అర్థం చేసుకుంటున్నారు. ఈ మూడురోజుల్లోనూ ప్రదర్శించిన అన్ని నాటకాల్లో బెంగాళీ, తెలుగు, హిందీ, తమిళ్ కలిసిపోయాయి. ఇక్కడ ప్లే మాత్రమే ప్రధానంగా నడిచింది. భాష రెండోస్థాయిలోకి మారిపోయింది. ఇక్క నటుల ప్రాంతాలవారీ  శరీరంలో ఉండే తేడాలూ ఏవీ ప్రేక్షకులు విడివిడిగా గుర్తించలేదు. ఇక్కడ భాషా, ప్రాంత సరిహద్దులు చెరిగిపోయాయి. ఇది మాకు మాత్రమే సొంతం అనే ఆలోచన లేకుండా ఇది మనది అనుకునే అందరం చూశాం.