- ఒక విజయం, ఓటమితో భారత్
- సెమీస్ చేరాలంటే లంకపై గెలవాల్సిందే
- మహిళల టీ20 ప్రపంచకప్
విజయక్రాంతి ఖేల్ విభాగం: ప్రతిష్ఠాత్మక మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ లీగ్ దశలో రెండు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. ఆడిన రెండింటిలో ఒక విజయం, ఒక ఓటమితో గ్రూప్-ఏలో నాలుగో స్థానంలో ఉంది. అసలే గ్రూప్ ఆఫ్ డెత్‌గా పరిగణిస్తున్న గ్రూప్-ఏలో భారత్‌తో పాటు డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్థాన్‌లు ఉన్నాయి.
న్యూజిలాండ్ చేతిలో పరాజయం చవిచూసిన భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో పోరులో మాత్రం సింహంలా గర్జించి మెగాటోర్నీలో దాయాదిపై మనకున్న రికార్డును మరింత పదిలం చేయడంతో పాటు విజయంతో బోణీ కొట్టింది. ఇక మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒకటి శ్రీలంకతో.. మరొకటి పటిష్టమైన ఆస్ట్రేలియాతో తలపడనుంది.
ఏ మాత్రం ఏమరపాటు వహించినా మొదటికే మోసం వచ్చే అవకాశ ముంది. కాబట్టి రానున్న రెండు మ్యాచ్‌ల్లో శక్తికి మించి ప్రదర్శన చేస్తేనే ఫలితం ఉంటుంది. లేదంటే తొలిసారి టీ20 కప్పు అందుకోవాలన్న కోరిక కలగానే మిగిలిపోయే అవకాశముంది.
ఆసీస్‌పై గెలవాల్సిందే..
ఈ ప్రపంచకప్‌లో భారత్.. న్యూజిలాండ్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో ఓటమి పాలవ్వడం దెబ్బతీసింది. మాములుగా చూస్తే ఒక ఓటమి పెద్దగా ప్రభావం చూపదనే చెప్పాలి. కానీ ఈసారి గ్రూప్ ఆఫ్ డెత్‌గా పరిగణిస్తున్న గ్రూప్-ఏలో హర్మన్ సేన ఉంది. పాకిస్థాన్‌పై విజయంతో రేసులో నిలిచినప్పటికీ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పైగా టీమిండియా ఆడాల్సిన రెండు మ్యాచ్‌ల్లో.. శ్రీలంక, ఆస్ట్రేలియా రూపంలో ప్రత్యర్థులు ఉన్నారు. రెండు నెలల క్రితం జరిగిన ఆసియా కప్ ఫైనల్లో లంక చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచిన భారత్ బుధవారం జరగబోయే మ్యాచ్ లో లంకను ఓడించి ప్రతీకారం తీర్చుకుంటుందా అన్నది చూడాలి. ఇప్పటికే సెమీస్ రేసుకు దూరమైన లంకను ఓడించడం భారత్‌కు పెద్ద కష్టం కాకపోవచ్చు.
కానీ అసలు సమస్య ఆస్ట్రేలియాతోనే. మహిళల క్రికెట్ లోనే అత్యంత ప్రమాదకర జట్టుగా పేరున్న ఆసీస్‌ను భారత్ ఓడించడం సవాల్‌కు మించిన పని. ఇప్పుడున్న ఫామ్ దృశ్యా కంగారులను ఓడించడం అంత సులువు కాదు. కానీ తమదైన రోజున ఏ జట్టునైనా ఓడించే సత్తా మన అమ్మాయిల సొంతం. కాబట్టి సెమీస్‌కు వెళ్లాలంటే ఆసీస్‌పై గెలుపు తప్పనిసరి.
ఇక పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో విఫలమైన స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఫామ్ కలవరపెడుతోంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ తక్కువ స్కోర్లకే వెనుదిరిగింది. దీంతో ఆమెపై ఒత్తిడి నెలకొంది. మిడిలార్డర్‌లో కీలకమైన కెప్టెన్ హర్మన్ పాక్‌తో మ్యాచ్‌లో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది.
మరి లంకతో మ్యాచ్‌లో హర్మన్ బరిలోకి దిగుతుందా లేదా అన్నది చూడాలి. రోడ్రిగ్స్ మినహా మిగతావారు రాణించాల్సిన అవసరముంది. బౌలింగ్ విభాగం టచ్‌లోకి వచ్చి నట్లు అనిపిస్తున్నా పూర్తి నమ్మకం మాత్రం కుదరడం లేదు. సమిష్టిగా ఆడితేనే కప్ కొట్టగలం అన్న సూత్రం భారత్ ఒంట బట్టించు కుంటే మంచిదని క్రీడా పండితులు అభిప్రాయ పడ్డారు.
పాయింట్ల పట్టిక
గ్రూప్‌ఏ
జట్టు మ్యా గె ఓ పా రరే
న్యూజిలాండ్ 1 1 0 2 +2.9
ఆస్ట్రేలియా 1 1 0 2 +1.9
పాకిస్థాన్ 2 1 1 2 +0.5
భారత్ 2 1 1 2 -1.2
శ్రీలంక 2 0 2 0 -1.6
నోట్: మ్యా-మ్యాచ్‌లు, గె-గెలుపు,
ఓ-ఓటమి, పా-పాయింట్లు, రరే-రన్‌రేట్