ఎన్నికల సమయంలో ఎత్తులకు పైఎత్తులు వేసి, అధికారి పీఠాలకు అతుక్కుపోయే రాజకీయ నాయకులెందరో. అలాంటి నాయకులపై ఎక్కుపెట్టిన వ్యంగ్యాస్త్రంగా తెలుగు చిత్రసీమలో ఓ సినిమాలో రూపొందింది. ఆ చిత్రమే ‘మహమ్మద్ బిన్ తుగ్లక్’. సరిగ్గా 53 ఏళ్ల క్రితం.. అంటే 1972, ఫిబ్రవరి 11న విడుదలైందీ చిత్రం.
తమిళ రంగస్థలంపై ఓ ఊపు ఊపిన చో రామస్వామి నాటకం ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు తెలుగులో బీవీ ప్రసాద్ దర్శకత్వం వహించారు. చలన చిత్ర బ్యానర్‌పై వీ జగన్మోహనరావు నిర్మించారు. కథ ఏంటంటే.. హిస్టరీ ప్రొఫెసర్ రంగనాథం చారిత్రక పరిశోధనలు జరిపే తరుణంలో తవ్వకాల్లో 600 ఏళ్ల క్రితం భారతదేశాన్ని పరిపాలించిన తుగ్లక్, అతని మిత్రుడు వదుదా ఒక శవపేటికలోంచి పైకి లేచివస్తారు.
అన్ని ఏళ్లు గడిచిపోయినా ఆ ఇద్దరికీ వార్ధక్యం అన్న మాటే లేదు. ఈ పరిశోధన, తుగ్లక్ పునరాగమనం గురించి దేశం నలుమూలలా వార్తలు వ్యాపిస్తాయి. ప్రొఫెసర్ కుటుంబం సహా, దేశభక్తుడు ధర్మారావు, చిలకజోస్యం చెప్పే రవణమ్మ తుగ్లక్ కార్యకలాపాలను శ్రద్ధగా పరిశీలిస్తుంటారు. తర్వాత ధర్మారావు ప్రభృతుల ప్రోత్సాహంతో తుగ్లక్ పార్లమెంటుకు పోటీ చేస్తాడు.
ఈనాటికి అనుకూలమైన అన్ని రాజకీయపు ఎత్తులు వేసి ప్రధాని అవుతాడు. తనను నమ్ముకున్న రంగనాథానికి, రవణమ్మకు మంత్రి పదవులిస్తాడు. మంత్రివర్గాన్ని తన చేతిలో కీలుబొమ్మగా చేసుకుని రాజకీయ దురంధరుడు అనిపించుకుంటాడు. తన ఆశయాలు ఒక్కొక్కటి వల్లిస్తూ ఏకపక్ష నిర్ణయాలు చేస్తుంటాడు.
ఈ నేపథ్యంలో ఓ రోజు.. డిసెంబర్ 31 అర్ధరాత్రి తుగ్లక్, వదుదాల మధ్య జరిగిన ఆంతరంగిక సంభాషణల్లో ఒక పెద్ద మలుపు తిరుగుతుంది. ఆ మలుపు ఏమిటనేది ఈ చిత్రానికంతటికీ పెద్ద సస్పెన్స్.