calender_icon.png 27 September, 2024 | 9:42 AM

ఈ రైతు.. సివి ల్ ఇంజినీర్!

27-09-2024 01:17:03 AM

  1. సొంతంగా వాగుపై వంతెన నిర్మాణం
  2. 18 ఏళ్లుగా చెక్కుచెదరని వంతెన

ఆదిలాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): ఎవరో వస్తారని, ఎదో చేస్తారని ఆ రైతు ఎదురు చూడలేదు. తానే ఓ ఇంజినీర్‌గా మారి వంతెనను నిర్మించుకుని తనతో పాటు రైతుల కష్టాలను తీర్చాడు. 18ఏళ్లయినా ఆ వంతెన చెక్కు చెదరకుండా ఉండ టం గమనార్హం. ఆదిలాబాద్ జిల్లా బేల మం డలంలోని మణియార్‌పూర్ గ్రామానికి చెందిన కడు గంగారాం అనే రైతుకు గ్రామ శివా రులో పది ఎకరాల పొలం ఉంది. వ్యవసాయ భూమి పక్క నుంచే పెన్‌గంగా నది ఉండటంతో నీటి వనరులకు కొదవ లేదు. అంతా బాగానే ఉన్నా పంట పొలానికి వెళ్లాలంటే గంగారాం అష్ట కష్టాలు పడాల్సి వచ్చేది. పెన్‌గంగా వాగు అవతల వైపు పొలాలు ఉండటంతో వాగు దాటడం కష్టం గా ఉండేది.

ఏటా వానాకాలంలో వాగు ప్ర వహించినప్పుడల్లా గంగారాంతోపాటు మ రికొందరు రైతులు అష్టకష్టాలు పడేవారు. పక్క గ్రామం నుంచి సుమారు 8 కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి తమ పంట పొలాలకు చేరుకోవాల్సి వచ్చేది. దీంతో సమయం వృథాతో పాటు ఎన్నో సమస్యలు ఎదురయ్యేవి. దశాబ్దాలుగా ఉన్న ఈ సమస్యను ఎవరో వచ్చి పరిష్కరిస్తారని ఎదురు చూడకుండా రైతు కడు గంగారాం సయం గా పరిష్కరించుకునేందుకు సిద్ధమయ్యాడు. 

వంతెన నిర్మాణానికి శ్రీకారం

తనతో పాటు ఇతర రైతులకు పొలానికి వెళ్లే దూరాభారాన్ని తగ్గించడం కోసం  గం గారాం వాగుపై  కర్రల సహాయంతో ఓ  వం తెన నిర్మించాలనుకున్నాడు. తోటి రైతుల సహాయంతో గంగారం వంతెన నిర్మాణానికి 2006లో శ్రీకారం చుట్టి సుమారు రెండు నెలల్లో పూర్తి చేశాడు. వాగుపై నిర్మాణానికి అవసరమయ్యే వస్తువులను సేకరించడం మొదలు పెట్టాడు. వృథాగా ఉన్న విద్యుత్ తీగలను, సిమెంటు స్తంభాలు, ఇనుప రాడ్లు, దృఢంగా ఉన్న కర్రలను, ఇనుప రేకులను కొన్నాడు. 100 మీటర్ల వెడల్పులో ఉన్న వాగుకు ఇరువైపులా సిమెంటు స్తంభాలతో  పిల్లర్లను ఏర్పాటు చేశాడు. ఈ పిల్లర్ల మధ్యలో విద్యుత్ తీగలను లాగి వాటిపై ఇనుప రేకులను వేసి, వంతెన నిర్మించాడు. ఈ వంతెన నిర్మించి 18 ఏళ్లు అయినప్పటికీ చెక్కుచెదరలేదు. ఇప్పటికి ఎన్నో వరదలు వచ్చినప్పటికీ తట్టుకొని నిలబడిన వంతెన పైనుంచి గంగారాంతో పాటు ఎంతోమంది రైతులు రాకపోకలు సాగిస్తున్నారు.

వంతెన కోసం 60 వేలు ఖర్చు చేశాను

పంట పొలాలకు వెళ్లాలంటే ప్రతి నిత్యం ఇ బ్బంది పడేవాడిని. నాతో పాటు ఇతర రైతులు సైతం ఎంతో ఇబ్బందులు పడేవా రు. మా సమస్యను ఎవరో తీరుస్తారని ఎదురు చూడకుండా కర్రలు, సిమెంట్ స్తంభాలు, విద్యుత్ తీగలు, ఇనుప రేకుల సహాయంతో వంతెనను నిర్మించుకున్నాం. ఈ వంతెన నిర్మాణానికి అప్పట్లో రూ.60 వేలు ఖర్చు చేసాం.

 కడ గంగారం, రైతు