వరద ముప్పు నుంచి 150 మంది ప్రాణాలను కాపాడిన వృక్షమిది..
ఆ అపురూప ఘట్టానికి రేపటికి 116 ఏళ్లు
‘ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్’ ఆధ్వర్యంలో రేపు స్మారక సమావేశం
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): సరిగ్గా 116 ఏళ్ల కిందట.. 1908 సెప్టెంబర్ 26, 27 తేదీల్లో కుంభవృష్టి కురిసింది. భాగ్యనగరాన్ని (హైదరాబాద్) వరదలు ముంచెత్తా యి. మూసీ ఉప్పొంగి నగరం అతులాకుతులమైంది. ఇక 28న మూసీ ఉగ్రరూపం దాల్చి జల ప్రళయం వచ్చింది. ఆ విలయం సుమారు 50 వేల మంది ప్రాణాలను కబళించింది. చరిత్రలో మూసీ వరదలు ఒక చేదు జ్ఞాపకం. మరో వైపు మూసీ నది ఒడ్డున్న ఉన్న చింతచెట్టు వరదల్లో చిక్కుకున్న ప్రాణాలు కాపాడింది.
ఇప్పటికీ చెట్టు చెక్కు చెదరకుండా పచ్చగా సజీవంగా ఉంది. నది 60 అడుగుల మేర పొంగడంతో వరదల్లో కొట్టుకువచ్చి సుమారు 150 మంది ఈచెట్టు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. అంతటి చరిత్ర ఉన్న చెట్టును పరిరక్షించేందుకు ఏ ప్రభుత్వమూ ముందుకు రాలేదు. గత ప్రభుత్వ హయాంలో నాటి జీహెఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ చింతచెట్టును పరిరక్షించి, ఆ ప్రాంతాన్ని ఉద్యానవనంగా ఆధునీకరించేందుకు రూ.కోటి మంజూరు చేశారు. తర్వాత ఆయన బదిలీ కావడంతో పనులు మూలనపడ్డాయి.
ఏటా ఉస్మానియా దవాఖాన వార్షిత్సవ వేడుకల సమ యంలో మాత్రం వైద్యాధికారులు ఈచెట్టును కూడా ముస్తాబు చేస్తారు. చివరి సారిగా 2002లో వేడుకలు జరిగాయి. తర్వాత మళ్లీ జరలేదు. 1908 సెప్టెంబర్ 28న చింతచెట్టు 150 మందిని కాపాడిన సందర్భంగా ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ ప్రతినిధులు శనివారం ఉస్మానియా దవాఖాన పార్క్‌లో స్మారక సమావేశం నిర్వహించనున్నారు. ఈసంస్థ కొన్నేళ్ల నుంచి ఏటా సెప్టెంబర్ 28న స్మారక దినోత్సవం నిర్వహిస్తున్నది. ప్రకృతి, పర్యావరణ ప్రేమికులు, సామాజిక వేత్తలు కార్యక్రమానికి హాజరు కావొచ్చని సంస్థ ప్రతినిధులు పిలుపునిస్తున్నారు.