భయమా?.. వణుకా?
* కేటీఆర్ ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకుని.. రాజీ చేసుకునేందుకుహడావిడిగా ఢిల్లీ వెళ్లారు.
మంత్రి పొంగులేటి
- కేటీఆర్ ఢిల్లీ ఎందుకు పోయిండు?.. ఢిల్లీ పెద్దల కాళ్లు మొక్కడానికా..
- నేను పేల్చబోయే బాంబేమిటో తెలిసిందా?
- ఒక్క కేసుకే ఇంత కంగారా?
- అవినీతి కేసులన్నీ బయటపడితే అంతరిక్షానికి వెళ్తారా?
- ప్రశ్నలు సంధించిన మంత్రి పొంగులేటి
ఖమ్మం, నవంబర్ 11 (విజయక్రాంతి): ఫార్ములా ఈ రేసింగ్ వ్యవ హారాల్లో అరెస్టు చేస్తారేమోనని భయపడి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఢిల్లీ వెళ్లారని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగు లేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.
‘ఇవ్వాలో, రేపో నేను పేల్చబోయే బాంబు ఏమిటో కచ్చితంగా తెలుసు కాబట్టే కేటీఆర్ ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకుని.. రాజీ చేసుకునేందుకు హడావిడిగా ఢిల్లీ వెళ్లారు’ అని ఆరోపించారు. సోమవారం ఖమ్మం రూరల్ మండలం చిన్న వెంకటగిరిలో జరిగిన కళ్యాణ లక్ష్మీ, షాదీముబాక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ఒక్క కేసుకే ఇంతా కంగారుపడితే, అవినీతి కేసులన్నీ బయటపడితే అంతరిక్షానికి వెళ్తారా అని ఎద్దేవా చేశారు. ఎంత పెద్ద దొరనైనా, ఏడేడు లోకాల అవతల దాక్కున్నా తప్పుచేస్తే వదిలేది లేదని స్పష్టం చేశారు.
‘ముక్కు సూటిగా ప్రశ్నిస్తున్నా ఈ నిమిషంలో కేటీఆర్ ఎక్కడ ఉన్నారు? ఎందుకు హడావిడిగా ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది? ఎవరి కాళ్లు మొక్కి ఏం లబ్ధిపొందుదామని ఢిల్లీ వెళ్ళారో యావత్ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రితో మీకున్న పనేమిటి? అని ప్రశ్నించారు.
ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో జరిగిన అవకతవకలను ప్రభుత్వం గుర్తించి, కేసు దర్యాప్తును ఏసీబీకి ఇచ్చిందని, చట్ట ప్రకారం ప్రజా ప్రతినిథిని అదుపులోకి తీసుకుని విచారించాలంటే దర్యాప్తు సంస్థలకు గవర్నర్ అనుమతి పొందాలని.. అందుకు ఏసీబీ ముందస్తుగా అనుమతి కోరిందని మంత్రి తెలిపారు. ఆ విషయం తెలుసుకుని, కేటీఆర్ హడావిడిగా ఢిల్లీకి పయనమైపోయారని అన్నారు.
కేటీఆర్ తప్పు చేసినట్లు తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని అన్నారు. లిక్కర్ స్కాం కేసులో కేంద్రం పెద్దలను ఒప్పించి, తన చెల్లి బెయిల్ పొందినట్లుగానే తనను తాను కాపాడుకునేందుకు ఢిల్లీ వెళ్ళారా అని ఆయన ప్రశ్నించారు. కవితకు బెయిల్ రావడంలో కేటీఆర్ ఎవరెవర్ని కలుసుకున్నదీ తనవద్ద సమాచారం ఉన్నదని చెప్పారు.
ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి కేబినేట్ అప్రూవల్ లేకుండానే కేటీఆర్ విదేశాల్లోని తన తొత్తు సంస్ధలకు నిధులు మళ్ళించారని, ఆధారాలు తమ వద్ద పదిలంగా ఉన్నాయన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రినో, ఆర్‌ఎస్‌ఎస్ వారినో లేకుంటే బీజేపీ పెద్దలు ఒకటి , రెండునో కలిసి పాదాభివందనం చేసి, కేసు నుంచి బయట పడేందుకు ఢిల్ళీ వెళ్ళారా అని పొంగులేటి ప్రశ్నించారు.
గతంలో తాను చెప్పినట్లు లక్ష్మీ బాంబా? తాటాకుల బాంబా? లేక దీపావళి బాంబా? లేక తన బాంబో పేలుతుందనే భయంతోనే ఢిల్లీకి పరుగులు తీశారా? అని ప్రశ్నించారు. రెండు రోజుల్లో జరగబోయే పరిణామాలు గ్రహించి, గవర్నర్ నుంచి క్లియరెన్స్ వస్తుందనే భయంతోనే హడావిడిగా ఢిల్లీకి చెక్కేశారని అన్నారు. తప్పు చేయనప్పుడు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? అని అన్నారు.
చట్టాన్ని, నియమ నిబంధనలను తుంగలో తొక్కి ఎలా విదేశాల్లోని తొత్తు సంస్ధలకు 55 కోట్లు పంపారో యావత్ తెలంగాణ ప్రజలకు , మీడియా సమక్షంలో తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఎక్కడైనా ఒప్పందం కుదిరిన తర్వాత , ఎంఓయూపై సంతకం చేసిన తర్వాతనే డబ్బు చెల్లించాల్సి ఉంటుది, కానీ అవేవి లేకుండా 25 రోజుల ముందుగానే ఏవిధంగా విదేశాల్లోని తొత్తు సంస్ధలకు డబ్బు పంపారు ? అని మంత్రి నిలదీశారు.
ఎటువంటి అఫ్రూవల్ లేకుండా.. ఎంఓయూ పై సంతకం చేయకుండా ముందుగా డబ్బు ఎలా పంపిస్తారు అని ప్రశ్నించారు. పేదోడు చెమటోడ్చి కట్టిన పన్నులకు సంబంధించిన 55 కోట్లను ఆర్బీఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా తొత్తు సంస్థలకు పంపారని అన్నారు. దేశానికి తెలియకుండా విదేశాలకు డబ్బు ఎలా పంపిస్తారు ? అని ప్రశ్నించారు.
ఆర్బీఐ గవర్నర్ పర్మిషన్ లేకుండానే ఇదంతా చేశారని అన్నారు. ఈ దేశ కరెన్సీని నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు ఎందుకు పంపారో యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు.
గత పదేళ్ల కాలంలో మీరు చేసిన మోసాలను, తప్పులను ఒక్కొక్కటి ప్రజల ముందుపెడితే తప్పించుకునేం దుకు భూమ్మీద నుంచి అంతరిక్షానికి కూడా వెళ్ళి దాక్కుంటారా అని ప్రశ్నించారు. నన్ను బాంబుల మంత్రి అని సంబోధించారు కదా మరీ మీరెందుకు కేంద్రం వద్దకు పరుగులు తీశారో ప్రజలందరికీ తెలుసన్నారు. పేదోడికి చెందాల్సిన ఆస్తులను కొల్లగొట్టిన వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని మంత్రి అన్నారు.
కాళేశ్వరం కట్టి దోచుకుతిన్నారు..
మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కట్టి అదేదో ప్రపంచ వింతల్లో ఎనిమిదో అ ద్భుతమైన వింతగా ప్రచారం చేసుకున్నా రు.. దాన్ని ఎవరి కోసం..ఎందుకోసం.. ఎవరి లబ్ధిపొందేందుకు కట్టారంటూ మంత్రి విరుచుపడ్డారు. పేదోడి సొమ్మును దోచుకుతిన్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ కాళేశ్వరాన్ని ఎందుకు కట్టారో తెలియదు కానీ చివరికి అది ఎవరూ కూలగొట్టకుండానే కూలిపోయిందని అన్నారు.
కేసీఆర్ దొర పోకడలు గత పదేళ్లు చూశాను.. పెయిడ్ ఆర్టిస్ట్‌లను కూర్చొబెట్టుకుని కేసీఆర్ మాట్లాడాడు.. కార్యకర్తలు జారిపోకుండా.. వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని అబద్ధాలు అడారని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం ఎప్పుడూ పేదోడిని కూలగొట్టదని అన్నారు. కేసీఆర్ తొత్తులు అక్రమ కట్టడాలు కడితే పేదలకు ఇవ్వడం కోసం కూల్చుతున్నామని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఎవరిపై కక్షసాధింపుల ఉండవని పొంగులేటి చెప్పారు.
వణుకా?
- అమృత్ టెండర్లలో సీఎం రేవంత్ రెడ్డి భారీ అవినీతి
- అర్హత లేని శోధా కంపెనీకి రూ. 1,137 కోట్ల పనులు
- కేంద్ర మంత్రి ఖట్టర్‌కుబీఆర్‌ఎస్ నేత కేటీఆర్ వినతిపత్రం
హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమృత్ టెండర్లలో భారీ అవినీతికి పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ధ్వజమెత్తారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను ఉల్లంఘించి తన బావమరిది సుజన్ రెడ్డికి చెందిన శోధా కంపెనీకి రూ. 1,137 కోట్ల విలువ చేసే పనులను అప్పగించారని నిప్పులు చెరిగారు.
తాను రాజధాని ఢిల్లీలో అడుగుపెట్టగానే కాంగ్రెస్ నాయకుల్లో వణుకుపట్టిందని, హైదరాబాద్‌లో ప్రకంపనలు ప్రారంభమైనట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఏమాత్రం అనుభవం, అర్హత లేని సంస్థకు కేవలం తన బావమరిది కంపెనీ అనే ఒక్క కారణంతో ఇంత పెద్దఎత్తున పనులను కట్టబెట్టారని ఆరోపించారు.
ఈ వ్యవ హారంలో సీఎం రేవంత్ రెడ్డి కీలకంగా వ్యవహరించి అధికార దుర్వినియోగానికి పాల్పడి తన బావమరిది కంపెనీకి రూ. 1,137 కోట్ల పనులు అప్పజెప్పారని పేర్కొనారు. అమృత్ 2.0 పథకంలో భాగంగా తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం వివిధ పనులకు రూ. 8,888 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు.
సోమవారం ఈ అంశంపై కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను ఢిల్లీలో కలిసి ఈ అవినీతిపై విచారణ జరిపించాలని ఎంపీలు సురేష్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దామోదర్‌రావులతో కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, అమృత్ టెండర్లలో భాగంగా రూ. 1,137 కోట్ల పనులు దక్కించుకున్న ముఖ్యమంత్రి బావమరిది కంపెనీ శోధా ఇన్ ఫ్రాక్చర్ లిమిటెడ్ 2021- ఆర్థిక సంవత్సరానికి కేవలం రూ. 2 కోట్ల 20 లక్షల లాభాన్ని మాత్రమే చూపించిందన్నారు. అలాంటి కంపెనీకి ఈమొత్తంలో పనులు ఎలా అప్పజెబుతారని ప్రశ్నించారు.
ఏమాత్రం అనుభవం, అర్హత లేని కంపెనీకి ఇన్ని కోట్ల పనులు అప్పగించారంటే తెర వెనుక భారీ అవినీతి బాగోతం జరిగిందన్నదనే విషయం అర్థమవుతోందన్నారు. రూ. 1,137 కోట్ల పనుల్లో ఇండియన్ హ్యూమ్ పైప్స్ కో. లిమిటెడ్ అనే కంపెనీకి 20 శాతం పనులు, మిగతా 80 శాతం పనులను శోధా సంస్థ చేసేలా ఒప్పందం చేసుకున్నారన్నారు.
మొత్తం ప్రాజెక్ట్ లో 80 శాతం పనులను ముఖ్యమంత్రి బావమరిది కంపెనీ కావటంతోనే ఇండియన్ హ్యూమ్ పైప్స్ లిమిటెడ్ సంస్థ శోధా సంస్థకు అప్పగించిందని చెప్పారు. అమృత్ టెండర్ల కు సంబంధించి పూర్తిగా మున్సిపల్ శాఖకే అధికారం ఉన్నందున పురపాలక శాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కచ్చితంగా ఈ టెండర్లను బావమరిదికి అప్పగించటం ద్వారా పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డాడని విమర్శించారు. ఈ వ్యవహారంపై పారదర్శకంగా విచారణ జరిపించి, అక్రమాలు జరిగితే టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధన ఉల్లంఘన
సీఎం రేవంత్ అమృత్ టెండర్లలో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను ఉల్లంఘించారని పేర్కొన్నారు. దీని నిబంధనలు చాలా శక్తివంతమైనవని, దీనిని ఉల్లంఘించిన ఎంతటి ప్రజా ప్రతినిధి అయిన వేటు తప్పదన్నారు.
ఇందుకు సంబంధించి పలు కేసులను వివరిస్తూ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గనుల కేటాయింపు, బిహారిలాల్ దోబ్రే వర్సెస్ రోషన్ లాల్ దోబ్రే కేసు, ది శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు వర్సెస్ వైరిచెర్ల ప్రదీప్ కుమార్ దేవ్ కేసు , ది జయా బచ్చన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు , దివ్య ప్రకాష్ వర్సెస్ కులతార్ చంద్ రాణా కేసులను ప్రస్తావించారు.
2014 లో సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనను ఉల్లంఘించి ల్యాండ్ కేటాయింపులు చేసిందో బయటపడిందన్నారు. కర్ణాటకలో ముడా స్కాం లో ఏ విధంగా అక్కడి సీఎం యడ్యూరప్ప తన భార్యకు భూములు కేటాయించారో అదే విధంగా రేవంత్ రెడ్డి అమృత్ టెండర్లలో తన బావమరిదికి మేలు చేశారని ఆరోపించారు.
కాంగ్రెస్ నేతల్లో వణుకు
తాను రాజధాని ఢిల్లీలో అడుగుపెట్టగానే కాంగ్రెస్ నాయకుల్లో వణుకుపట్టిందని, హైదరాబాద్‌లో ప్రకంపలను ప్రారంభమైనట్లు కేటీఆర్ పేర్కొన్నారు. అప్పుడే వణికితే ఎలా అని, ముందు ముందు చాలా ఉందన్నారు. రాష్ట్ర సంపదను దోచుకున్న నేతలకు తగిన పాఠం తప్పదని, త్వరలో ప్రభుత్వం చేసే తప్పులు ప్రజలకు వివరిస్తామన్నారు. 11 నెలలో పాలన జరిగిన దోపిడి బయటపెడుతానని తెలిపారు. రేవంత్ అవినీతి, అక్రమాలపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లిన ఆయన కేంద్ర మంత్రి మనోహర్ ఖట్టర్‌ను కలిశారు.
పారదర్శకంగా విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి
అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందన్నది బహిరంగ రహస్యమేనని, ముఖ్యమంత్రి అవినీతిని అరికట్టాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. అధికార దుర్వినియోగం, అవినీతి నిరోధక చట్టాలను ఉపయోగించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అమృత్ టెండర్లలో చట్టవిరుద్దంగా కేటాయింపులు, అక్ర మ ఒప్పందాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అక్రమాలు నిజమ ని రుజువైతే టెండర్లు రద్దు చేసి సీఎం రేవంత్‌పై వేటు వేయాలని కోరారు.