calender_icon.png 2 February, 2025 | 5:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ బడ్జెట్ ప్రజల గొంతుని వినిపించింది

02-02-2025 02:14:27 AM

  • కొత్త పన్ను విధానానికి బిల్లు

మీడియా సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ప్రజల గొంతుకగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభివర్ణించారు. బడ్జెట్ ప్రసంగం తర్వాత నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు. ఆదాయ పన్ను శ్లాబ్ పరిమితిని పెంచడం ద్వారా ప్రజలకు ఎక్కువ మొత్తంలో డబ్బు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

రూ.12లక్షల వరకూ పన్ను మినహాయింపు ఇవ్వడం ద్వారా సుమారు కోటి మందికి పన్ను చెల్లింపు నుంచి ఊరట లభిస్తుందని వివరించారు. జూలైలో తాను ప్రకటించిన ఆదాయపు పన్ను సరళీకరణ ఇప్పటికి పూర్తయినట్టు వెల్లడించారు. కొత్త ఆదాయపు పన్ను విధానానికి పార్లమెంట్ ఆమోదం తప్పనిసరా? అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ స్పందించారు. 

కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని పార్లమెంట్ ఆమోదం లేకుండా తీసుకురాలేమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అంతేకాకుండా వచ్చే వారమే ఇందకు సంబంధించిన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. అలాగే పన్ను శ్లాబులను వివరించడానికి నిర్మలా సీతారామన్ కొన్ని ఉదహరణలు చెప్పారు.

మునుపటి ఆదాయపు పన్ను విధానం ప్రకారం రూ.12లక్షల వరకు వార్షిక ఆదాయం కలిగిన వాళ్లు సుమారు రూ.60వేల నుంచి రూ.80వేల వరకూ పన్నుగా చెల్లించాల్సి వచ్చేందన్నారు. అయితే కొత్త పన్ను విధానం ద్వారా ఎటువంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదన్నారు.

సవరించిన కొత్త పన్ను శ్లాబుల ద్వారా అధిక సంపాదనదారులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. సీనియర్ సిటిజన్లకు పన్ను మినహాయింపు పరిమితిని రూ.1లక్షకు రెట్టింపు చేస్తామన్నారు.