calender_icon.png 21 March, 2025 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ

20-03-2025 02:18:57 AM

  • తునికల, కొలతల శాఖలో ఆయనదే హవా
  • స్టాంపింగ్ పేరుతో అక్రమ వసూళ్లు

సూర్యాపేట, మార్చి19 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తూనికల, కొలతల శాఖలో ఓ ప్రైవేటు వ్యక్తి రాజ్యం నడుస్తుందనే ఆరోపణలు వినబడుతున్నాయి. కార్యాలయంలో కాంటాల రిపేరరుగా విధులు నిర్వహించే ఆ వ్యక్తి నిబంధనలకు విరుద్దంగా దుకాణాలలో తిరుగుతూ స్టాంపింగ్ పేరుతో వ్యాపారుల నుంచి  డబ్బులు వసూళ్లు చేస్తున్నారనేది బహిరంగ రహస్యమే అంటున్నారు. 

జిల్లాలో అనుమతులు ఇలా ఉన్నాయి..

 జిల్లాలో తూనికలు, కొలతల పరికరాలు అమ్మడానికి కేటగిరి1 కింద సూర్యాపేట పట్టణంలో మూడు దుకాణాలకు అనుమతి ఉండగా, కేటగిరి2 సూర్యాపేటలో ఒక దుకాణం, కోదాడలో ఒక దుకాణం అనుమతు పొందింది. ఇక  తూనికలు పరికరాలకు స్టాంపింగ్ వేయుటకు సూర్యాపేటలో 4గురు, కోదాడలో ఇద్దరు అనుమతి పొంది ఉన్నారు.

స్టాంపింగ్ పేరుతో...

 జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల దుకాణాలు, పెట్రోల్ బంకులు, వే బ్రిడ్జిలు తదితరాలు కలిపి సుమారు 90 వేల వరకు ఉన్నాయి. రెండేళ్లకోసారి కాంటాలు, తూకం రాళ్లకు, ఏడాదికోసారి ఎలక్ట్రానిక్ కాంటాలకు తూనికలు, కొలతల శాఖ ముద్రలు వేయించాల్సి ఉంటుంది.  నిబంధన ప్రకారం వ్యాపారులు  స్టాంపింగ్ కొరకు జిల్లా కార్యాలయం లేదా స్టాంపింగ్ అనుమతి పొందిన వ్యక్తులను సంప్రదిస్తే ప్రభుత్వ రుసుము ఆన్లైన్ ద్వారా చెలించి స్టాంపింగ్  అనుమతి పొందాలి.

అదే సమయంలో కాంటా పనితీరును సరిచూసి స్టాంపింగ్ వేయాలి. కానీ జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి ప్రతి దుకాణాములు తిరుగుతూ స్టాంపింగ్ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాంటాల పని తీరును పరిశీలించకుండానే స్టాంపింగ్ రుసుము వసూళ్లు చేస్తున్నారని అంటున్నారు.

దుకాణం వద్ద సాధరణ రశీదు ఇస్తున్నారని, ఇందులో కొందరికి ఆన్లైన్ రశీదులు ఇవ్వడం లేదని, తానే మొత్తం చూసుకుంటానని  వ్యాపారులకు చెబుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. గత ముప్పు ఏండ్ల నుంచి ఇతను ఇదే తరహాలో వసూళ్లు చేస్తూ అడిగిన వారికి మాత్రమే ఆన్లైన్ రశీదు ఇస్తున్నారని అంటున్నారు. ఏ అధికారి వచ్చిన అతన్ని మచ్చిక చేసుకొని ఇదే తరహా వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కానీ ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అధికారిపై చర్యలు మాత్రం లేవు. 

అందరికీ ఆన్‌లైన్ రశీదు ఇస్తున్నాము

 మా కార్యాలయంలో సరిపడ సిబ్బంది లేకపోవడంతో స్టాంపింగ్ కొరకు  రిపేరర్లు దుకాణాల వద్దకు వెలుతున్నారు. అక్కడ వసూలు చేసిన మొత్తానికి ఆన్లైన్ రశీదు ఇస్తున్నాము. రశీదులో తేడాలు ఉంటే పిర్యాదు చేయవచ్చు.

 చిట్టిబాబు, జిల్లా తూనికల కొలతల అధికారి,