ఉత్తర కొరియా అధినేత కిమ్ కఠిన నిర్ణయం
ఉత్తరకొరియా, సెప్టెంబర్ 4: ఉత్తరకొరియాలో చిన్న చిన్న తప్పులకు కూడా కఠినమైన శిక్షలు విధిస్తారు ఆ దేశాధినేత కిమ్‌జోంగ్ ఉన్. ఇటీవల ఆ దేశం భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైంది. ఈ సమయంలో విపత్తు నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలకు కిమ్ సిద్ధమయ్యారు. దాదాపు 30 మంది ప్రభుత్వ అధికారులకు మరణశిక్ష అమలు చేయాలని కిమ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
అవినీతి, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణాలతో కొంతమంది అధికారులకు మరణశిక్ష విధించినట్లు దక్షిణ కొరియా మీడియా తొలుత వెల్లడించింది. ఆ తర్వాత వీరికి శిక్షను అమలు చేసినట్లు తెలిపింది. దీనిపై అధికారికంగా ఎలాంటి స్పష్టత లేదు. ఆ అధికారులు ఎవరన్న వివరాలు సైతం బయటకు రాలేదు. చాగాంగ్ రాష్ట్ర పార్టీ కమిటీ సెక్రటరీ కాంగ్‌బాంగ్ హూన్ కూడా శిక్ష పడినవారిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విపత్తు సమయంలో కిమ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినప్పుడు హూన్‌ను విధుల నుంచి తొలగించారు. దీంతో ఆయనకు శిక్ష పడి ఉండవచ్చని పలు కథనాలు పేర్కొన్నాయి.