న్యూఢిల్లీ, ఆగస్టు 13: ప్రపంచంలోనే అతి పురాతనమైన క్యాలెండర్ తుర్కియే దేశంలోని దక్షిణ ప్రాంతంలో దొరికింది. గోబెక్లి టేపే వద్ద ఆర్కియాలజిస్టులు పరిశోధనలు చేస్తుండగా ఒక భారీ రాతి స్తంభం బయటపడింది. దానిపై సూర్యచంద్రులు, మరికొన్ని చిహ్నాలను వారు గుర్తించారు. కాగా అది 13 వేల ఏళ్ల నాటిదని, రాతి స్తంభంపై ఉన్న గుర్తులు అప్పటి కాలాలకు సంబంధించి సూర్యచంద్రులను ఆధారంగా చేసుకుని లెక్కించినట్లు భావిస్తున్నారు.
ఈ చిహ్నాలను 10,000 బీసీలో చెక్కి ఉంటారని భావిస్తున్నారు. దీనిని అప్పట్లో క్యాలెండర్‌గా ఉపయోగించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ స్తంభంపై 365 ఆకారపు చిహ్నాలు ఉన్నాయని, అందులో ఒక్కొక్కటి ఒక్కో రోజును సూచిస్తోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇందులో 12 చంద్ర నెలలు, అదనంగా 11 రోజులు ఉన్నట్లు వివరించారు. అందులో కనిపిస్తున్న పక్షిలాంటి ఆకారం చుట్టూ ఒకే విధమైన చిహ్నాలు ఉన్నాయని, అవి అప్పటి కాలాలను సూచిస్తున్నట్లు పేర్కొన్నారు.