calender_icon.png 23 October, 2024 | 11:06 AM

13 మంది పౌరహక్కుల సంఘం నేతల అరెస్టు

15-09-2024 01:00:22 AM

రఘునాథపాలెం అటవీ ప్రాంతానికి వెళ్లకుండా నిర్బంధం

భద్రాద్రి కొత్తగూడెం/ హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): భద్రాద్రి జిల్లా కరకగూడెం మండల పరిధిలోని రఘునాథపాలెం అడవుల్లో ఇటీవల ఎన్‌కౌంటర్ జరిగి ఆరుగురు మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఎన్‌కౌంటర్‌పై రాష్ట్ర మానవ, పౌరహక్కుల సంఘం కమిటీ సభ్యులు స్పందించింది. ఈ మేరకు 12 మంది పౌర హక్కుల నేతలు శనివారం విచారణకు బయల్దేరగా వారిని మణుగూరు, అశ్వాపురం పోలీసులు  అడ్డుకొన్నారు.

వారిని రఘునాథపాలెం వెళ్లనీయకుండా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టున వారిలో రాష్ట్ర పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నారాయణతో పాటు మరో తొమ్మిది మంది ఉన్నారు. వారిని మణుగూరు, అశ్వాపురం పోలీస్ స్టేషన్లలోనే నిర్బంధించారు. కనీసం వారిని మీడియాతో మాట్లాడేందుకు కూడా అనుమతించలేదు. దీనిలో భాగంగా అశ్వాపురం పోలీస్ స్టేషన్ పూర్తిగా గేట్లుమూసి వేయడం గమనార్హం. ఈ చర్యలను ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. 

ఫ్లకార్డులతో నిరసన ప్రదర్శన

అశ్వాపురం, మణుగూరు పోలీస్  స్టేషన్లలో నిర్బంధించిన పౌరహక్కుల సంఘం నాయకులను తక్షణం విడుదల చేయాలని శనివారం ప్రజా హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు సింగు ఉపేందర్ డిమాండ్ చేశారు. ఈమేరకు కొత్తగూడెం బస్టాండ్ సెంటర్‌లో తోటి నాయకులతో కలిసి ఫ్లకార్డులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అలాగే తెలంగాణ ప్రజా ఫ్రంట్(టీపీఎఫ్) రాష్ట్ర కన్వీనర్ రాచమౌని నాగభూషణం హైదరాబాద్‌లో పలువురితో కలిసి నిరసన వ్యక్తం చేశారు. పౌరహక్కుల సంఘం నేతలను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు.