1౦ సీట్లిస్తే ముస్లిం కోటా రద్దు
సర్జికల్ స్ట్రుక్ చేసే ధైర్యం కాంగ్రెస్‌కు ఉందా
బీజేపీ ఉన్నన్ని రోజులు పీవోకేను పాక్ వశం కానివ్వం
70 ఏళ్లు రామమందిర నిర్మాణాన్ని కాంగ్రెస్ అడ్డుకుంది
రాముని ప్రాణప్రతిష్టకు ఖర్గే, రాహుల్, ప్రియాంక ఎందుకు రాలేదు?
సీఎం రేవంత్‌రెడ్డి ఫన్నీగా మాట్లాడుతున్నారు
వికారాబాద్, వనపర్తి సభల్లో కేంద్రమంత్రి అమిత్ షా
వికారాబాద్ / వనపర్తి, మే 11 ( విజయక్రాంతి) : ఉగ్రవాదంతో నిండిపోయిన పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రుక్ చేసే దైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉందా? అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశ్నించారు. సర్జికల్ స్ట్రుక్ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫన్నీగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తాము సర్జికల్ స్ట్రుక్ చేసి పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల ఇళ్లలోకి వెళ్లి మరీ మట్టుపెట్టినట్లు తెలిపారు. మే 13న జరుగనున్న లోక్‌సభ పోలింగ్‌లో బీజేపీ అత్యధిక స్థానాలను సాధిస్తుందని, ముచ్చటగా మూడోసారి నరేంద్రమోదీ ప్రధానమంత్రి అవుతున్నారని, అందులో ఎలాంటి సందేహం లేదని చెప్పారు.
ప్రజలంతా బీజేపీ వైపు ఉన్నారని షా అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి ౧౦ పార్లమెంటు స్థానాలు ఇస్తే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేస్తామని చెప్పారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్‌లోని ఎస్‌ఏపీ మైదానంలో, వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించిన నాగర్‌కర్నూల్ జనసభకు అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్బంగా చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ప్రజలకు చూపిస్తూ కమలం పువ్వుకు ఓటు వేసి కొండాను గెలిపించాలని తెలిపారు.
బీజేపీ ఉన్నన్ని రోజులు పీవోకే పాకిస్తాన్‌కు చెందదన్నారు. పాకిస్తాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయని కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ అంటున్నారు.. అంటే వాళ్ల వద్ద అణుబాంబులు ఉంటే పీవోకే ఇచ్చేయాలా అంటూ షా ప్రశ్నించారు. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమనే విషయాన్ని కాంగ్రెస్ వాళ్లు ఇప్పటికైనా గుర్తించాలన్నారు. కాంగ్రెస్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే మోదీ ఉగ్రవాదాన్ని అంతం చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ విధానాల్లో దేశానికి ఎవరు మేలు చేస్తున్నారో ఓటర్లు తెలుసుకోవాలన్నారు.
మోదీలాంటి నిజాయితీ గల వ్యక్తి ప్రధానిగా ఉండటం ఈ దేశానికి అవసరమన్నారు. మోదీపై ఒక్క అవినీతి మరకలేదని, దీపావళి రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న మోదీ కావాలా? వేసవి విడిది కోసం విదేశాలకు వెళ్లే రాహుల్ కావాలో తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రధాని మోదీ అవుతారని, ఇండియా కూటమిలో ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరో కాంగ్రెస్ నాయకులు చెప్పగలరా అని ప్రశ్నించారు. ఇండియా కూటమికి అధికారం ఇస్తే ఏడాది ఒకరు ప్రధాని అవుతారని విమర్శించారు.
రామ మందిర నిర్మాణం జరుగకుండా కాంగ్రస్ పార్టీ 70 ఏళ్లు అడ్డుకుందని అమిత్ షా ఆరోపించారు. మోదీ కేవలం ఐదేండ్లలో రామ మందిర నిర్మాణం పూర్తి చేసి రామునికి ప్రాణప్రతిష్ట చేసినట్లు చెప్పుకొచ్చారు. రాముని ప్రాణప్రతిష్టకు కాంగ్రెస్ నాయకులు ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీలకు ఆహ్వానం ఉన్నా రాలేదని విమర్శించారు. ఈ విషయం తెలంగాణలోని ప్రతి ఒక్కరికి తెలుసునన్నారు. కేవలం ముస్లింల మెప్పు పొందడానికే రాముని ప్రాణ ప్రతిష్టకు రాలేదని, అలాంటి వాళ్లకు చేవెళ్ల ప్రజలు ఎలా ఓటు వేస్తారన్నారు. ఏ అంటే అసదుద్దీన్, బీ అంటే బీఆర్‌ఎస్, సీ అంటే కాంగ్రెస్ ఈ ముగ్గురు ఒకటేననే విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు.
కాంగ్రెస్ పార్టీని సీఎం రేవంత్ రెడ్డి ఏటీఎంగా మార్చారు
రాజ్యాంగాన్ని బీజేపీ మార్చేస్తుందని ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు ఎందుకు భారతరత్నను ఇవ్వలేకపోయారని అమిత్ షా ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ పార్టి అధికారంలోకి వచ్చిన తరువాత అంబేద్కర్‌కు భారతరత్న అవార్డును ఇవ్వడంతో పాటు, జనవరి 26 ను సంవిదాన్ దినంగా, అంబేద్కర్ జన్మస్థలాన్ని విద్యాపరంగా, లండన్‌లో చదివిన స్థలంలో భవ్యమైన విజ్ఞాన కేంద్రంగా నిర్మించామని, మోదీ ప్రభుత్వంలో తొలి రాష్ట్రపతి దళితుడైన రామ్‌నాథ్ కోవింద్‌కు ఇవ్వడం జరిగిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లో 10 ఏండ్లలో 12లక్షల కోట్ల కుంభకోణాలు, అవినీతి జరిగిందని, గడిచిన పదేండ్ల బీజేపీ పాలనలో ఒక్క అవినీతి , కుంభకోణం జరిగిందా అని ఆయన ప్రజలకు ప్రశ్నించారు. తెలంగాణలో 4 శాతం మైనార్టీ రిజర్వేషన్ అమలు చేస్తున్నారని, భవిష్యత్తులో 4 శాతం రిజర్వేషన్‌ను తీసివేస్తామని, ఓవైసీకి భయపడి తెలంగాణలో విమోచన దినోత్సవాన్ని జరపడం లేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు.
ఆర్టికల్ 370ని రద్దు చేసి కాశ్మీరును భారతదేశంలో విలీనం చేయడం జరిగిందని, ముస్లిం మహిళలు ఎదురుకుంటున్న త్రిబుల్ తలాక్‌ను రద్దు చేయడం జరిగిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే త్రిబుల్ తలాక్ మళ్లీ మొదలు అవుతుందని షా అన్నారు. నరేంద్రమోదీ గ్యారెంటీ, పూర్తి చేసే గ్యారెంటీ అని కాంగ్రెస్ గ్యారెంటీ చైనీస్ గ్యారెంటీ అని, అది ఎప్పటికి పూర్తి కాదన్నారు.
కాంగ్రెస్‌ను ఏటీఎంగా మార్చారు..
ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలకు అబద్ధాలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ అని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఏటీఎంగా మార్చారన్నారు. సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 9వ తేదీన రైతులందరికి రూ 2లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి ఇప్పటి వరకు రెండు రూపాయలు కూడా మాఫీ చేయలేకపోయారన్నారు. నిరుద్యోగులకు రూ 5లక్షలు బ్యాంకులో డిపాజిట్, మహిళలకు స్కూటీ, ప్రతి నియోజకవర్గంలో ఇంటర్నేషల్ పాఠశాల వంటివి ఒక్క హామీలను సైతం అమలు చేయలేకపోయారని చెప్పారు.
నాగర్‌కర్నూల్ అభివృద్ధ్ది పథంలో నడుస్తుంది..
కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాగర్‌కర్నూల్ పార్లమెంట్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడం జరుగుతుందన్నారు. రూ 820 కోట్లతో కల్వకుర్తి నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ మీదుగా నంద్యాల వరకు నేషనల్ హైవే, రూ 1100 కోట్లతో కృష్ణానదిపై సోమశిల వద్ద బ్రిడ్జి పనులకు నిధులను మంజూరు చేయడం జరిగిందని , భవిష్యత్తులో అచ్చంపేటలో టూరిజం అభివృద్ధికి రూపకల్పన చేయడం జరుగుతుందని, భద్రాచలం, రామప్ప దేవాలయం, జోగుళాంబ అమ్మవారి దేవాలయాలను అభివృద్ధి చేసుకుం టామని, జోగుళాంబ అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం ఇప్పటికే రూ 100 కోట్లు ఇవ్వడం జరిగిందన్నారు.
రిజర్వేషన్లు రద్దు చేస్తామని తప్పుడు ప్రచారం
బీజేపీకి 400 ఎంపీ స్థానాలు వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మార్పింగ్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు ఆరోపించారు. రాజ్యాంగబద్ధం కాని ముస్లిం రిజర్వేషన్లను మాత్రమే రద్దు చేసి ఆ రిజర్వేషన్లను బీసీ, ఎస్టీ, ఎస్టీలకు ఇస్తామనే విషయాన్ని మరోసారి అమిత్ షా స్పష్టం చేశారు. బీజేపీకి ఓటు వేస్తే నూటికి నూరుశాతం ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామన్నారు.
కాళేశ్వరం పేరుతో బీఆర్‌ఎస్ తెలంగాణను దోచుకుందని ఆరోపించారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానానికి ఏటీఎంగా మారినట్లు ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధికి ఈ పది ఏళ్లలో 9 లక్షల కోట్లు కేంద్రం ఇచ్చినట్లు తెలిపారు. పేదలకు ఉచిత బియ్యం ఇస్తున్నామని, వంట గ్యాస్ కనక్షన్లు ఇస్తున్నామన్నారు. తెలంగాణలో చేపట్టిన ప్రతి అభివృద్ధి పనుల్లో కేంద్రం వాటానే అధికంగా ఉన్నట్లు అమిత్ షా తెలిపారు. వికారాబాద్‌లో బుల్లెట్ ట్రైన్ మొదటి స్టేషన్ ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు.
నాయకుల అవస్థలు
నాగర్‌కర్నూల్ జనసభ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తన ప్రసంగాన్ని హిందీలో ప్రారంభించారు. కొద్ది సేపు మాట్లాడిన తరువాత తాను మాట్లాడుతున్న మాటలు అర్థం అవుతున్నాయా లేదా , అర్థం అయితే చేతులు పైకి లేపండి అంటూ షా చెప్పగా కొద్దిమంది మాత్రమే సమాధానం ఇచ్చారు. దీంతో నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు షా ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించారు. కొద్ది సేపటి తర్వాత హిందీ మాటలు అర్థం కాక గమ్మున ఉండిపోయారు. అనంతరం అమిత్ షా మాటలకు జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి అనువాదం ప్రారంభించారు.
అమిత్ షా హిందీలో మాట్లాడిన మాటలకు తెలుగులో పలుమాటలను తప్పుగా అనువందించారు. ముస్లిం మహిళలు త్రిబుల్ తలాక్ వల్ల తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని అలాంటి త్రిబుల్ తలాక్ వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తిరిగి త్రిబుల్ తలాక్ అమలు అవుతుందని అమిత్ షా చెప్పగా, బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన త్రిబుల్ తలాక్‌ను కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగిస్తుందని అనువందించారు.