09-02-2025 01:50:39 AM
ఒకప్పుడు హ్యాట్రిక్ విజయాలతో ఢిల్లీలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కనీసం ఒక్క సీటును కూడా సాధించలేకపోతుంది. ఢిల్లీ ప్రజలు వరుసగా మూడోసారి కాంగ్రెస్ పార్టీకి శూన్యహస్తాలు ఇవ్వడంతో ఆ పార్టీ ఉనికి ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇదంతా స్వయంకృతాపరదమేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటు న్నారు.
ఢిల్లీ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత 1998లో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధికారాన్ని చేజిక్కించుకుంది. ఆ తర్వాత షీలా దీక్షిత్ నాయక త్వంలో హస్తం పార్టీ ఢిల్లీలో మరింత శక్తిమంతమైంది. దీంతో 2003, 2008 ఎన్నిక ల్లో వరుస విజయాలు నమోదు చేసింది.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందనే ఆరోప ణలు వెల్లువెత్తాయి. దీంతో 2013లో అవినీతికి వ్యతిరే కంగా గళాన్ని వినిపించిన ఆమ్ ఆద్మీకి ఢిల్లీ ప్రజలు పట్టం కట్టారు.
2013 నుంచి మొదలైన కష్టాలు
కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్‌ఆద్మీ పార్టీ గట్టి పోటీ ఇవ్వడంతో 2013 ఎన్నికల్లో కేవలం 8 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్.. 2015, 2020, 2025 ఎన్నికల్లో కనీసం ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. దీనికి ఢిల్లీలో పార్టీకి బలమైన నాయకత్వలోపించడమే ప్రధాన కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
షీలా దీక్షిత్ తర్వాత అంతటి బలమైన నేతలను కాంగ్రెస్ ఢిల్లీలో తయారు చేయలేకపోయింది. ఆప్‌కు కేజ్రీవాల్, బీజేపీకి నరేంద్రమోదీ బలమైన నాయకులుగా కనిపిస్తుండగా కాంగ్రెస్‌కు మాత్రం అలాంటి బలమైన నేత లేరనే మాటలు వినిపిస్తున్నాయి.
వ్యూహం కూడా లేదు
కొద్ది రోజుల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగంగా ఆప్, కాంగ్రెస్‌లు కలిసి పోటీ చేశాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే రెండు పార్టీలు వేరువేరుగా బరిలోకి దిగాయి. కొన్ని నెలల్లో ఈ రెండు పార్టీలు వ్యవహరించిన తీరుతో ఢిల్లీ ప్రజలు గందరగోళంలో పడ్డారు. అది అంతిమంగా బీజేపీకి లాభం చేకూర్చింది.
ఎన్నికల్లో ఆప్, బీఎస్పీ, ఎంఐఎం వంటి చిన్న పార్టీలు కూడా బరిలో ఉండటంతో కాంగ్రెస్‌కు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆదరణ లభించలేదని తెలుస్తుంది. అలాగే ఢిల్లీ ప్రజలు కాలుష్యం, నిరుద్యోగం వంటి ప్రధాన సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటి పరిష్కారానికి కాంగ్రెస్ ప్రజలకు బలమైన హామీని ఇవ్వలేకపోయిందనే వాదన కూడా వినిపిస్తుంది.
భవిష్యత్తు ఏంటి..
ఢిల్లీ సహా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ వరుస పరాజయాలు మూటకట్టుకుంటున్న తరుణంలో ఆ పార్టీ సంస్థాగతంగా బలంగా మారేందుకు అధిష్టానం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తేనే భవిష్యత్తులో పార్టీకి మనుగడ ఉంటుందని పేర్కొంటున్నారు. లేదంటే ఉనికి ప్రశ్నార్థకమవుతుందని చెబుతున్నారు.