- పట్టణప్రాంతాల్లో సర్వేను వేగవంతం చేసేందుకు నోడల్ ఆఫీసర్లు
- జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,58,150 కుటుంబాల పరిధిలో సర్వే పూర్తి
హైదరాబాద్/ సిటీ బ్యూరో, నవంబర్ 11 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కులగణన సర్వే మూడోరోజు ఊపందుకున్నది. మెజార్టీ ప్రజలు సర్వేకు సహకరిస్తుండగా, కొన్నిచోట్ల మాత్రం ఎన్యూమరేటర్లకు నిరనస సెగ తగులుతోంది.
సాంకేతిక సమస్యల కారణంగా శని, ఆది వారాల్లో ఒక్కో ఎన్యూమరేటర్ రోజుకు సగటున 7 8 వరకు ఫామ్స్ నింపగా, మూడోరోజు ఒక్కొక్కరూ 15 ఫామ్స్ వరకు సేకరించినట్టు తెలుస్తు న్నది. నగరాలు, పట్టణాల్లో సర్వే వేగవంతం చేసేందుకు నోడల్ ఆఫీసర్లను నియమించింది.
‘గ్రేటర్’ పరిధిలో సర్వే ఇలా..
జీహెచ్‌ఎంసీ పరిధిలో 19,218 మంది ఎన్యూమరేటర్లు మొదటిరోజు 12,912 కుటుంబాలు, రెండోరోజు ఆదివారం 69,624 కుటుంబాలు, మూడోరోజు 88,516 కుటుంబాల చొప్పున ఇప్పటివరకు 1,58,150 కుటుం బాలను సర్వే చేశారు. సర్వేను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు జీహెచ్‌ఎంసీ నోడల్ ఆఫీసర్లను నియమించింది. 30 సర్కిళ్లకు 10 మందికి ఆ బాధ్యతలు అప్పగించింది.
నోడల్ ఆఫీసర్లు వీరే..
కాప్రా, మల్కాజిగిరి, సికింద్రాబాద్ సర్కిళ్లకు నోడల్ ఆఫిసర్‌గా జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ సరోజ నియమితులయ్యారు. హయత్ నగర్, ఎల్బీనగర్, సరూర్‌నగర్ సర్కిళ్లకు అడిషనల్ కమిషనర్ పంకజ, సంతోష్‌నగర్, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా సర్కిళ్లకు అడిషనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్..
మలక్‌పేట, చార్మినార్, రాజేంద్రనగర్‌కు ఎస్టేట్ ఆఫీసర్ శ్రీనివాస్‌రెడ్డి, మెహదీపట్నం, కార్వాన్, జూబ్లీహిల్స్ సర్కిళ్లకు ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్ శరత్‌చంద్ర, గోషామహల్, ముషీరాబాద్, అంబర్‌పేట సర్కిల్‌కు లీగల్, ఎలక్ట్రిసిటీ అడిషనల్ కమిషనర్ సత్యనారాయణ, యూసుఫ్‌గూడ, శేరిలింగంపల్లి, చందా నగర్‌కు చీఫ్ ఎగ్జామినర్ అకౌంట్స్ వెంకట్‌రెడ్డి, పటాన్‌చెరు, మూసాపేట్, కూకట్‌పల్లి సర్కిళ్లకు అడ్వర్టుజ్‌మెంట్ అదనపు కమిషనర్ వెంకట్‌రెడ్డి, కుత్బుల్లాపూర్, గాజుల రామారం సర్కిళ్లకు అడిషనల్ కమిషనర్ శానిటేషన్ రఘుప్రసాద్, అల్వాల్, బేగంపేట, సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఉప్పల్ సర్కిళ్లకు అడిషనల్ కమిషనర్ స్పోర్ట్స్ యాదగిరిరావు నియమితులయ్యారు.
బీసీ డెడికేషన్ కమిషన్ విచారణ..
బీసీ డెడికేషన్ కమిషన్ చైర్మన్ బి.వెంకటేశ్వరరావు నేతృత్వంలో సోమవారం హైదరాబాద్‌లోని ఆ విభాగ కార్యాలయంలో కమిషన్ విచారణ జరిగింది. చైర్మన్ ఈ సందర్భంగా వివిధ కుల సంఘాల నుంచి వచ్చిన వినతులను సేకరించారు. ప్రజాభిప్రాయాల నివేదికను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. మంగళవారం స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాలు, సంక్షేమ సంఘాలతో బహిరంగ విచారణ నిర్వహిస్తామన్నారు.
అలాగే ఈనెల 13న రంగారెడ్డి కలెక్టరేట్ పరిధిలో డెడికేటెడ్ కమిషన్ బహిరంగ విచారణ చేపడుతుందన్నారు. ఉదయం 11:30 నుంచి సాయంత్రం 3:30 గంటల వరకు కమిషన్ అందుబాటులో ఉంటుందని, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలకు చెందిన ప్రజలు, కుల సంఘాల నుంచి వచ్చిన వినతులు స్వీకరిస్తుందని ప్రకటించారు.