పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ చిత్రం ‘దేవా’ ఇటీవల విడుదలైంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా హీరో షాహిద్ కపూర్‌తో కలిసి పూజా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అగ్ర హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు అందుకుంటున్న పూజ హెగ్డేకు ఈ విషయమై విలేకరుల నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి.
దీంతో ఆమె వారిపై ఆగ్రహానికి గురయ్యింది. “సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్ వంటి బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో నటించటం మీ అదృష్టంగా భావిస్తున్నారా? ఆ సినిమాలకు మీరు అర్హులేనని అనుకుంటున్నారా?’ అని విలేకరి ప్రశ్నించాడు. ఆ సినిమాలకు నేను అర్హురాలినే. తమ సినిమాల్లోకి తీసుకోవటానికి దర్శక నిర్మాతలకు కొన్ని కారణాలుంటాయి.
ఏ అవకాశం వచ్చినా దానికి అనుగుణంగా సన్నద్ధమై ఆ పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలి. అలా చేస్తే అదృష్టం వరించినట్టేనని నేను అనుకుంటా. నా జీవితంలో అదే జరిగింది. ఒకవేళ మీరు అదృష్టం వల్లే నాకు ఈ అవకాశాలు వచ్చాయనుకుంటే.. నేను ఏమాత్రం బాధపడను. అలాగే అనుకోండి” అని కొంచెం అసహనం వ్యక్తం చేసింది.
‘మీరు సినిమాలు ఎలా ఎంచుకుంటారు? స్టార్ హీరోల సినిమాలైతేనే చేస్తారా?’ అంటూ స్టార్ హీరోల గురించి విలేకరి వరుస ప్రశ్నలు వేయటం పూజా హెగ్డేకు కోపం తెప్పించింది. దీంతో విలేకరిని.. ‘అసలు మీ సమస్యేంటీ?’ అని ప్రశ్నించింది. వాతావరణం వేడెక్కుతోందని భావించిన షాహిద్ కపూర్ వెంటనే కలుగజేసుకొని సరదాగా మాట్లాడారు.
‘నువ్వు నటించిన స్టార్ హీరోలంటే అతనికి ఇష్టం అనుకుంటా.. ఆయన కూడా ఆ హీరోల పక్కన యాక్ట్ చేయాలనుకుంటున్నారు. అందుకే నీ నుంచి సలహాలు తీసుకుంటున్నట్టున్నారు’ అంటూ షాహిద్ హాస్య గుళికలు విసిరారు.