30-03-2025 12:00:00 AM
నేడు సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభం
ఏప్రిల్ నుంచి రేషన్ దుకాణాలలో..
మేడ్చల్, మార్చి 29 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నుంచి రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించినందున, జిల్లా యం త్రాంగం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉగాది రోజున ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తుండగా, ఏప్రిల్ కోటాలో రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యం అందనున్నాయి.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 523938 రేషన్ కార్డులు ఉన్నాయి. 1718351 మందికి తలా ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం అందనున్నాయి. ప్రతి నెల 10640.052 మెట్రిక్ టన్నుల బియ్యం అందజేస్తారు. జిల్లాలో మొత్తం 619 రేషన్ దుకాణాలు ఉన్నాయి.
పేద ప్రజలకు వరం
రేషన్ దుకాణాల ద్వారా ఇప్పటివరకు ముక్కి పోయిన, దొడ్డు బియ్యం అందేవి. దొడ్డు బియ్యంతో అన్నాన్ని ప్రజలు తినేవారు కాదు. ఈ బియ్యాన్ని విక్రయించి సన్న బియ్యం కొనుగోలు చేసేవారు. రేషన్ బియ్యాన్ని డీలర్లు, దళారులు కిలో రూ.15,16 నాకు కొనుగోలు చేసేవారు. వీరు ఈ బియ్యాన్ని రైస్ మిల్లర్లకు విక్రయించేవారు.
రైస్ మిల్లర్లు వీటిని రీసైక్లింగ్ చేసి సన్నబియంగా బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. కిలో బియ్యం 50 నుంచి 60 రూపాయలకు విక్రయించి రెట్టింపు లాభాలు గడిస్తున్నారు. సన్న బియ్యం పంపిణీ వల్ల ప్రజలు వండుకొని తినే అవకాశం ఉంది. సన్న బియ్యం అక్రమంగా విక్రయించకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం ధరల తగ్గుముఖం
బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం హోల్సేల్‌లో కిలోకు పది రూపాయల వరకు తగు ముఖం పట్టాయి. సన్న రకం ధాన్యానికి బోనస్ ఇవ్వడంతో విస్తీర్ణం పెరిగింది. సన్న బియ్యం ధరలు తగ్గుముఖం పట్టడానికి విస్తీర్ణం పెరగడంతో పాటు ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం కూడా కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. సన్న బియ్యం పంపిణీ చేస్తే బహిరంగ మార్కెట్లో కొనుగోలు తగ్గుతాయని, అందుకే వ్యాపారాలు ధరలు తగ్గించారని అంటున్నారు.