- ఆలస్యం చేయకుండా వెంటనే బోనస్ ఇవ్వాలి
- ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలి
- వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): రాష్ట్రంలో సన్న, దొడ్డు రకాలను వేర్వేరుగా సేకరించాలని, ధాన్యం విక్రయించిన రైతుకు చెల్లింపులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు.
ఆలస్యం చేయకుండా వెంటనే సన్నరకాలకు బోనస్ ఇవ్వాలని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్నిరకాల మౌలిక వసతులు కల్పించాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను, అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ నుంచి మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అన్ని అంశాల్లో తెలంగాణ నంబర్‌వన్‌గా ఉందని, గతంలో ఎప్పుడు లేని విధంగా ధాన్యం కొనుగోలు, చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయన్నారు.
ఉమ్మడి జిల్లాలకు కేటాయించిన ఇన్‌ఛార్జి మంత్రులు, ఇన్‌ఛార్జి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ధాన్యం కొనుగోళ్ల తీరును పర్యవేక్షించాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన నివేదికను ప్రతిరోజు సమర్పించాలని ఆదేశించారు. ధాన్యం కోసం లారీల ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. సన్నరకం వడ్లకు 500 బోనస్ ఇవ్వడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
30న పాలమూరులో రైతు పండగ..
కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసే విధంగా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ర్టంలో 66 లక్షల ఎకరాల్లో ధాన్యం పండించారని, ఇంకా 20 లక్షల ఎకరాల్లో పంట కోయాల్సి ఉందన్నారు. సరిహద్దు జిల్లాల్లో నుంచి బోనస్ కోసం ధాన్యం రాష్ర్టంలోకి వస్తుందని, ఆ ధాన్యం పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఈనెల 30వ తేదీన మహబూబ్ నగర్ లో రైతు పండగను జరుపబోతున్నామని, దానిని పురస్కరించుకొని 28, 29, 30 తేదీల్లో మహబూబ్ నగర్ లో వ్యవసాయ అనుబంధ రంగాల ఎగ్జిబిషన్ ఏర్పాటు, వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు, యాంత్రీకరణ, ఆదర్శ రైతులతో రైతు అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఈనెల 30న జరిగే రైతు పండుగను కలెక్టర్లు అందరు సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. అక్రమాలకు పాల్పడే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాల వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై రైతులకు అందిస్తున్న సౌకర్యాల గురించి ప్రజలకు చేరే విధంగా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.