20-02-2025 12:55:04 PM
భద్రాచలం,(విజయక్రాంతి): జనసంచారం లేని సమయంలో ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసి వారి మెడలో ఉన్న బంగారపు వస్తువులను లాక్కెళుతున్న చైన్ స్నాచర్స్ పట్టణాల్లోనే కాదు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా రెచ్చిపోతూ తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో ఓ మహిళ మెడలో నుంచి 10 లక్షల విలువైన బంగారపు గొలుసులను ఇద్దరు దుండగులు చాకచక్యంగా లాక్కెళ్ళిపోయారు. గురువారం తెల్లవారుజామున ఆరు గంటల సమయంలో ఇద్దరు యువకులు భద్రాచలం తాత గుడి సెంటర్ లో ఉన్న ప్రసాద్ కిరాణా షాప్ వద్దకు వొచ్చి ముందుగా సిగరెట్లు కొని దుకాణంలో ఉన్న సుశీల అనే మహిళకు ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించారు.
అదే సమయంలో సుశీల మెడలో ఉన్న విలువైన బంగారపు గొలుసులను గుర్తించిన దుండగులు తిరిగి మళ్లీ వాటర్ బాటిల్ కూడా కావాలంటూ మహిళతో మాట్లాడుతూ ఒక్కసారిగా మెడలోని పుస్తెలతాడు, నల్లపూసల గొలుసును లాక్కొని పారిపోయారు. మహిళ అరుస్తూ వెంటపడేందుకు ప్రయత్నించిన ముందుగానే పక్కా ప్లాన్ తో వచ్చిన ఇద్దరు దొంగలు ఒకరు బండిని స్టార్ట్ చేసి సిద్ధంగా ఉండగా మహిళ మెడలోని గొలుసులను లాక్కొని సిద్ధంగా ఉన్న బండిపై ఎక్కి రెప్పపాటు సమయంలో మాయమైపోయారు.
బాధితురాలు ఏం జరిగిందో తెలుసుకునేసరికి చైన్స్ స్నాచర్స్ అక్కడ నుండి మాయమైపోయారు. వెంటనే చుట్టుపక్కల వాళ్ళుకు విషయం తెలుపగా వెంటనే 100 నెంబర్ కు డయల్ చేశారు. దీంతో ఫిర్యాదు అందుకున్న పోలీసులు చోరీ జరిగిన సంఘటన స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకొని చైన్స్ స్నాచర్స్ సమాచారం కోసం రంగంలోకి దిగారు. బాధితులు మాత్రం చోరీకి గురైన సొమ్ము 12 కాసుల పుస్తెలతాడు, ఐదు కాసుల నల్లపూసల గొలుసు మొత్తం సుమారు 13 తులాలపైగా బంగారం పది లక్షల విలువ ఉంటుందని తమ బంగారాన్ని ఎత్తుకెళ్లిన నిందితులను పట్టుకొని తమ బంగారం తమకు అందేలా చూడాలని పోలీసులను కోరుచున్నారు.