17-12-2024 12:05:27 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 16 (విజయక్రాంతి): గ్రేటర్‌లో దొంగల బెడద రోజురోజుకు అధికమవుతుంది. రాత్రింబవ ళ్లు తేడా లేకుండా దొంగతనాలకు పాల్పడు తూ అందిన కాడికి దోచుకెళ్తున్నారు. గతం లో కేవలం తాళాలు వేసిన ఇండ్లు, కార్యాలయాలను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడే కేటుగాళ్లు.. ప్రస్తుతం ఇంట్లో యజమానులను బెదిరించి మరీ దొంగతనాలు చేస్తున్నారు.
ఈ మధ్య గ్రేటర్‌లోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో వరుసగా చోటుచేసుకున్న దొంగతనాలు, చైన్ స్నాచింగ్స్, బైక్, సెల్‌ఫోన్ల చోరీలే ఇందుకు నిదర్శనం. పోలీసుల అలసత్వం.. దొంగల బరితెగింపు వెరసి చోరీలు క్రమం గా పెరుగుతున్నాయి. బాధితులు ఫిర్యాదు చేస్తేనే పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారని.. చో
రీల రికవరీలోనూ నిర్లక్ష్యంగా వహిస్తున్నారని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో డయల్ 100కు కాల్ చేసి నా పోలీసులు సకాలంలో స్పందించడం లేదని ప్రజలు వాపోతున్నారు. తాజా గా నగరంలో నెలకొన్న పరిస్థితులు చూస్తుం టే ఎప్పుడు ఎవరొచ్చి దాడి చేస్తారోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.
ఇకనైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రతాపరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
పెట్రోలింగ్ వాహనాలకు సుస్తీ..
ఒకప్పుడు ఏ గల్లీలో చూసినా పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు కుయ్‌కుయ్ మం టూ శబ్దం చేస్తూ తిరిగేవి. కానీ, ఈ మధ్యకాలంలో పెట్రోలింగ్ వ్యవస్థకు సుస్తీ చేసిందనే చెప్పాలి. గ్రేటర్ సిటీలోని మూడు కమిషనరేట్ల పరిధిలో రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వ హించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కేవలం వీఐపీలు, ఎమ్మెల్యే, ఎంపీలు, పోలీసు ఉన్నతాధికారులుండే ప్రాంతాల్లో మినహా బస్తీలు, సిటీ శివారు కాలనీల్లో నిఘాపెట్టడం లేదని ప్రజలు బహాటంగానే చర్చించుకుంటున్నారు. వరుసగా చైన్ స్నాచింగ్‌లు, చోరీలు జరిగిప్పుడే పోలీసులు తెగ హడావుడి చేస్తుంటారని.. తర్వాత మళ్లీ షరా మామూలే అన్నట్లు నడుచుకుంటారని విమర్శిస్తున్నారు.
మూడు కమిషనరేట్ల పరిధిలో ప్రతీ పోలీస్‌స్టేషన్‌కు రెండు పెట్రో లింగ్ వాహనాలు అందుబాటులో ఉన్నా యి. ఒక్కో పెట్రోలింగ్ వాహనంలో ఒక హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లు డ్యూటీలో ఉంటారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు 5 గంటల వరకు తమ ఏరియాలో పెట్రోలింగ్ నిర్వహించాలి.
డయల్ 100కు వచ్చే కాల్స్‌తో పాటు స్టేషన్‌కి వచ్చే ఎమర్జెన్సీ కాల్స్‌కు స్పందిస్తూ 10 నిమిషాల వ్యవధిలోనే స్పాట్‌కు చేరుకోవాలి. పీఎస్ పరిధిలోని హాట్ స్పాట్స్, చోరీలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో సైరన్ వేసుకొని గస్తీ నిర్వహించాలి. పెట్రోలింగ్‌కు వచ్చినట్టు స్థానికుల నుంచి పాయింట్ బుక్‌లో ఎంట్రీ చేసుకోవాలి.
కానీ, నైట్ డ్యూటీలో ఉండే సిబ్బంది పెట్రోలింగ్‌కు బదులు పీఎస్‌లో నిద్రపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక వేళ వెళ్తే.. కేవలం నిమిషాల వ్యవధిలోనే తిరిగి వచ్చి పీఎస్‌కు చేరుకోవడమో లేదా ఏదైనా పబ్లిక్ ప్లేస్‌లో వాహనం పెట్టుకుని కూర్చోవడమో చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
తాజాగా జరిగిన కొన్ని సంఘటనలు
* గత శుక్రవారం గండిపేట మండలం హైదర్షాకోట్ సన్‌సిటీలో పట్టపగలు ఓ ఆగంతకుడు వచ్చి ఓ ఇంటి కాలింగ్ బెల్ నొక్కాడు. డోర్ తెరవగానే మహిళ మెడలో నుంచి 4 తులాల గొలుసును కేవలం సెకన్ల వ్యవధిలో లాక్కొని పరారయ్యాడు.
* ఈ నెల 12న దోమలగూడ పీఎస్ పరిధిలో ఓ బంగారం వ్యాపారి ఇంట్లోకి చొరబడిన 10 మంది దుండగులు కత్తులు, తుపాకులతో ఇంట్లో ఉన్నవారిని బెదిరించి 2.5 కిలోల బంగారం, ఖరీదైన ఫోన్లు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.