calender_icon.png 1 April, 2025 | 9:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లిలో హడలెత్తించిన దొంగలు

30-03-2025 12:26:42 AM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని కాల్‌టెక్స్ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున దొంగలు హడలెత్తించారు. రెండిళ్లలో చొరబడి పెద్దమొత్తంలో దొంగతనానికి పాల్పడ్డారు. కాల్‌టెక్స్ ప్రాంతంలో ఇటీవలనే గృహప్రవేశం చేసిన బీఆర్‌ఎస్ నాయకులు సానశ్రావణ్ తన ఇంట్లో నిద్రిస్తుండగా దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. బీరువాని పగులగొట్టి అందులో నుండి 14 తులాల బంగారు నగలతో పాటు కిలోన్నర వెండిని దోచుకెళ్లారు. ఇదే ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు సుధాకర్ ఇంట్లోకి చొరబడి 3 తులాల బంగారం.రూ లక్ష నగదు ఎత్తుకెళ్లారు. ఇదే ఘటనలో కాలనీలో ఇళ్లముందు నిలిపి  ఉంచిన 4 బైకులను చోరీ చేశారు.

బాధితుల ద్వారా విషయం తెలుసుకున్న బెల్లంపల్లి ఏసీపి ఏ.రవికుమార్, బెల్లంపల్లి రూరల్ సీఐ సయ్యద్ అప్జలొద్ధీన్ లతో పాటు బెల్లంపల్లి టూటౌన్, తాళ్లగురిజాల, వన్‌టౌన్ ఎస్‌ఐలు కె.మహేందర్, చుంచు రమేష్, రాకేష్, ఏఎస్‌ఐ తిరుపతిలు సంఘటన స్థలానికి చేరుకుని భాదితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. డాగ్ స్కాడ్‌తో భాదితుల ఇళ్లతో పాటు పరిసర ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య విషయం తెలిసిన వెంటనే భాదితులు సాన శ్రావణ్ ఇంటికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. దొంగలను గుర్తించి భాదితులకు న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను కోరారు. త్వరలోనే ఈ సంఘటనకు పాల్పడిన దొంగలను గుర్తించి  పట్టుకుంటామని ఏసీపి రవికుమార్ తెలిపారు. డాగ్ స్కాడ్‌తో పాటు క్లూస్ టీం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.