16-04-2025 08:35:20 AM
కుంట కట్ట తొలగించేందుకు రంగం సిద్ధం
ప్రత్యేక లారీలో హిటాచి రాక... కట్ట మట్టి తరలించేందుకు చేరుకున్న భారత్ బెంజిలు
కట్ట మాదే... భూములు మావే అంటూ స్థానికుల ఆగ్రహం
స్థానికుల ఫిర్యాదుతో దొంగల కుంట దగ్గరకు అర్ధరాత్రి చేరుకున్న రూరల్ ఎస్సై విజయ్ కుమార్
పనులు ఆరంభించిన.. స్థానికుల ఆగ్రహంతో నిలిచిన కట్ట తొలగింపు ప్రక్రియ
మహబూబ్నగర్, (విజయక్రాంతి): పాలమూరు పట్టణం(Palamuru town)లో భూ కబ్జాదారులు ఆగడాలు రోజురోజుకు వారితారస్థాయికి చేరుకుంటున్నాయి. కళ్ళముందు కనిపిస్తున్న ప్రత్యేక ఆధారాలు ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం మాత్రం చూసి చూడనట్టు వ్యవరిస్తుందని ఆరోపణలు సైతం పట్టణంలో చక్కెరలు కొడుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి పాలమూరు పట్టణంలోని ఎంవీఎస్ డిగ్రీ, పీజీ కళాశాల వెనుక భాగంలో ఉన్న దొంగలకుంట కట్టను తొలగించేందుకు కొందరు వ్యక్తులు రంగం సిద్ధం చేసుకున్నారు. ప్రత్యేక లారీలో హిటాచిని, భారత్ బెంజ్ వాహనాలను దొంగలకుంట దగ్గరకు తీసుకు వచ్చారు.
వాహనం నుంచి హిటాచిని దింపి... దొంగల కుంట కట్టను తొలగించేందుకు పనులను ప్రారంభించారు. ఈ విషయాన్ని స్థానికులు తెలుసుకొని దొంగలకుంట కట్ట దగ్గరకు చేరుకొని ఈ కట్ట మాదే.. ఈ భూములు మావే.. తొలగించేందుకు మీరు ఎవరు..? అంటూ ప్రశ్నించారు. దీంతో పాటు సంబంధిత పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందని, చేసేదేమీ లేక 100కు ఫిర్యాదు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై విజయ్ కుమార్(Rural Police Station Sub-Inspector Vijay Kumar) దొంగలకుంట కట్ట దగ్గరికి చేరుకున్నారు. ఈ విషయంపై స్థానికులతో ప్రత్యేకంగా మాట్లాడినట్లు వీడియోలు సైతం సోషల్ మీడియాలో ప్రచారం అయ్యాయి. భూములు ఎవరివి అనేవి ప్రశాంతమైన వాతావరణంలో చర్చించుకోవాలని ఎస్ఐ సూచించినట్లు తెలుస్తుంది. మంగళవారం అర్ధరాత్రి బుధవారం ఉదయం 12:30 వరకు కుంట కట్టను తొలగించేందుకు హిటాచి చదును చేసినప్పటికీ స్థానికులు పనులు నిలిపివేయాల్సిందే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అర్థరాత్రి దొంగలకుంట పై దౌర్జన్యం...
నియమ నిబంధనలు పాటిస్తూ పనులు చేపట్టే వ్యక్తులు అర్ధరాత్రి హీటాచిని తీసుకువచ్చి భారత్ బెంజ్ వాహనాలను(Bharat Benz vehicles) దొంగలకుంట దగ్గరికి రప్పించి కట్టను తొలగించవలసిన అవసరం ఏముందని స్థానికులు భారీ ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి ఇలా చేయడం ఏంటని ? ఇది ఎంతవరకు సమంజసం అంటూ కొందరు స్థానికులు అక్కడ బీష్మించుకొని ప్రశ్నల వర్షం కురిపించారు. అక్కడికి చేరుకున్న ఎస్సై విజయ్ కుమార్ సర్ది చెప్పేందుకు ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ ఉన్న స్థానికులు ఈ సమయంలో పనులు చేయడమేంటని ఎదురు ప్రశ్నలు వేసినట్లు తెలుస్తుంది. హిటాచి నడిపే వ్యక్తులను సైతం ప్రశ్నించగా మమ్మల్ని పనులు చేయమని చెప్పారని అందుకే చేస్తున్నామని స్థానికుల దగ్గర వారు పేర్కొన్నట్లు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో దొంగలకుంట చెరువు కట్టను తొలగించేందుకు వీలులేదని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయంపై మేము ఎంతటి దూరమైనా వెళ్తామని ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది స్థానికులు పేర్కొంటున్నారు.
అర్ధరాత్రి ప్రారంభం...అప్పుడే నిలిపివేత...
కట్టను తొలగించేందుకు ప్రత్యేక వాహనంలో వచ్చిన హిటాచి ద్వారా పనులు ప్రారంభించినప్పటికీ అక్కడ ఉన్న స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కట్ట తొలగింపు ప్రక్రియను నిలిపివేయక తప్పలేదు. అర్ధరాత్రి అన్ని సిద్ధం చేసుకుని కట్ట తొలగించేందుకు చర్యలు తీసుకున్నప్పటికీ స్థానికుల అసానంతో అక్కడ నుంచి కదలక పోవడంతో చేసేదేమీ లేక కట్ట తొలగింపక్రియలను నిలిపివేశారు. అర్ధరాత్రి అక్కడ నుంచి వాహనాలు వెళ్లిపోయాయి. జర ఇప్పటికైనా ఉన్నత అధికారులు పూర్తిస్థాయిలో పర్యవేక్షణ నిరంతరం చేసి ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంపై ఉన్నత అధికారులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారో వేచి చూడాలని అక్కడి స్థానికులు అంటున్నారు .