22-01-2025 12:34:49 AM
బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పూజల వెంకటేశ్వరరావు
సిద్దిపేట, జనవరి 21 (విజయక్రాంతి): అనేక మంది అర్హులైన నిరుపేదలు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే వారి పేర్లు ఎంపిక జాబితాలో లేకపోవడం బాధాకరమని తాను ఎలాంటి దరఖాస్తు చేసుకోకుండానే నా పేరు, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ తో సహా రేషన్ కార్డు ఎంపిక జాబితాలో ఉండడం దురదృష్టకరంగా భావిస్తున్నానని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, సిద్దిపేట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పూజల వెంకటేశ్వరరావు(చిన్న) అన్నారు.
మంగళవారం సిద్దిపేటలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాకు రేషన్ కార్డు మంజూరు చేసి పరువు తీశారని ఆవేదన చెందారు. తనకు రెండు కార్లు, ఒక కమర్షియల్ కాంప్లెక్స్, సొంత ఇల్లు ఉందని, మూడు పూటలా తినడానికి భోజనం ఉందని అలాంటప్పుడు నాకు రేషన్ కార్డు ఎలా మంజూరు చేస్తారని మండిపడ్డారు.
తన కుటుంబ సభ్యులతో కలిపి సంవత్సరానికి రూ.50 లక్షలు ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తున్న తనకు రేషన్ కార్డు మంజూరు చేయడం అధికారుల నిర్లక్ష్యానికి, ప్రభుత్వం పనితనానికి నిదర్శనం అన్నారు. సిద్దిపేట మున్సిపల్ అధికారులు రూపొందించిన జాబితాలో 1754 సీరియల్ నెంబర్ పై తన పేరు నమోదయి ఉన్న మంజూరు పత్రాన్ని చూపించారు.
తాను మునిసిపల్ వైస్ చైర్మన్ గా తన భార్య మున్సిపల్ కౌన్సిలర్ గా పనిచేసిన అనుభవంలో అనేకమందికి రేషన్ కార్డులు, అంత్యోదయ కార్డులు ఇప్పించిన సందర్భాలు ఉన్నాయని తన చేతిలో అధికారం, అవకాశం ఉన్నప్పుడే రేషన్ కార్డు మంజూరు చేసుకోలేదని అలాంటిది ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తున్న నాకు రేషన్ కార్డు కావాలని దరఖాస్తు ఎలా చేసుకుంటానని ప్రభుత్వాన్ని నిలదీశారు. తనకు సమాజంలో ఉన్న పలుకుబడిని, పరువును దిగజార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తన పేరును రేషన్ కార్డు మంజూరు జాబితాలో నమోదు చేసిందని మండిపడ్డారు. ఈ అంశంపై న్యాయ నిపుణుల సలహా తీసుకొని పరువు నష్ట ధావ నమోదు చేస్తానని చెప్పారు.