- మలేషియాపై భారత్ ఘన విజయం
- హ్యాట్రిక్‌తో పాటు ఐదు వికెట్ల్లతో మెరిసిన వైష్ణవి
కౌలాలంపూర్: ప్రతిష్ఠాత్మక ఐసీసీ అండర్ మహిళల టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. మంగళవారం మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో యంగ్ ఇండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన మలేషియా భారత ఆఫ్ స్పిన్నర్ వైష్ణవి శర్మ (5/5) ధాటికి 14.3 ఓవర్లలో 31 పరుగులకే కుప్పకూలింది.
స్పిన్‌తో దడదడలాడించిన వైష్ణవి మ్యాచ్‌లో హ్యాట్రిక్‌తో పాటు ఐదు వికెట్లు పడగొట్టడం విశేషం. మరో స్పిన్నర్ ఆయుషి శుక్లా 3 వికెట్లు తీసింది. జట్టులో 10 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం 32 పరుగుల టార్గెట్‌ను భారత్ 2.5 ఓవర్లలోనే ఛేదించి గెలుపొందింది.
ఈ విజయంతో నాలుగు పాయింట్లు ఖాతాలో వేసుకున్న భారత్ (+9.1) మెరుగైన రన్‌రేట్ కారణంగా పట్టికలో టాప్‌లో ఉండగా.. లంక (+5.5) రెండో స్థానంలో కొనసాగుతోంది. భారత్ తన తర్వాతి మ్యాచ్ గురువారం శ్రీలంకతో ఆడనుంది. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో వైష్ణవి హ్యాట్రిక్‌తో మెరిసింది. ఇక మహిళల టీ20 ప్రపంచకప్‌లో మలేషియాది (31) రెండో అత్యల్ప స్కోరు. 6 పరుగుల అత్యల్ప స్కోర్లతో మాల్దీవ్స్, మాలీ సంయుక్తంగా ఉన్నాయి.