calender_icon.png 18 October, 2024 | 8:02 PM

నా కథతో సినిమా తీయాలనుకున్నారు

28-07-2024 12:05:00 AM

 పుస్తకావిష్కరణ కార్యక్రమంలో డాక్టర్ సునీతా కృష్ణన్ 

ప్రజ్వల సేవా సంస్థ నిర్వాహకురాలు డాక్టర్ సునీతా కృష్ణన్ రాసిన ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. హైబరాబాద్ బేగంపేటలో ఉన్న ఓ ప్రైవేటు హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి సీతక్క, అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. హ్యూమన్ ట్రాఫికింగ్‌లో చిక్కుకున్న అమ్మాయిలను కాపాడిన సునీతా కృష్ణన్ పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శనీయం అని తెలిపారు. లైంగిక దాడికి గురైనవారు కుంగిపోకుండా వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపటం సునీతా కృష్ణన్ గొప్పతనం అని చెప్పారు. తన గాయాలను ఉద్యమాలుగా మలిచిన ఆమె తన కూడా స్ఫూర్తేనని సీతక్క పేర్కొన్నారు.

జెన్నిఫర్ లార్సన్ మాట్లాడుతూ.. సునీతా కృష్ణన్‌తో కలిసి పనిచేయటం ఆనందంగా ఉందన్నారు. ఆమెతో ప్రయాణం తమకెంతో గర్వకారణం అని చెప్పారు. పుస్తక రచయిత సునీతా కృష్ణన్ మాట్లాడుతూ.. ‘ఈ బుక్ రాయడానికి రెండు కారణాలున్నాయి. మా తండ్రి ఆటోబయోగ్రఫీ రాసుకోవాలనుకున్నారు. దాన్ని ఆయన చనిపోయే రెండు నెలల ముందే పబ్లిష్ చేశాం. చదివిన వాళ్లంతా మా తండ్రి సేవలను గొప్పగా, స్ఫూర్తిదాయకంగా ఉందంటూ పొగిడారు. అప్పుడే అనిపించింది నా ఆటో బయోగ్రఫీ కూడా రాసుకోవాలని.

నా మీద సినిమా తీయాలని బాలీవుడ్ వాళ్ల బయోపిక్ రెడీ చేశారు. వాళ్లు నా పర్మిషన్ అడిగితే వద్దని చెప్పా. తర్వాత నా కథను నేనే రాసుకోవాలని నిర్ణయించుకున్నా. 13 రోజుల్లోనే బుక్ రాసేశా. ‘బీయింగ్ సర్వైర్ అని పేరు పెడితే అందరూ నువ్వు సర్వైర్ కాదు.. ఫైటర్ అని అన్నారు. చివరకు ‘ఐ యామ్ వాట్ ఐ యామ్’ అని పెట్టేశాను” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బాలాంబ, ఐపీఎస్ అధికారి అమిత్ గార్గ్, సినీ దర్శకుడు రాజేశ్ టచ్‌రివర్, టీవీ యాంకర్ స్వప్న తదితరులు పాల్గొన్నారు.