26-02-2025 01:46:19 AM
కరీంనగర్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): కరీంనగర్-మెదక్-నిజామాబాద్ -ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 4 గంటలకు ముగిసింది. తీవ్ర పోటీ నెలకొనడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బుల పంపకంపై దృష్టి సారించి రాత్రి నుండి కొందరు పంపకాల ప్రక్రియను ప్రారంభించారు. కొందరు అభ్యర్థులకు 25 మందికి ఒక ఇంచార్జిని, కొందరు 100 మంది ఓటర్లకు ఒక ఇంచార్జిని నియమించి ప్రచారం ముగిసిన అనంతరం డబ్బులు, మద్యం పంపిణీకి సిద్ధమైనారు.
పట్టభద్రుల నియోజకవర్గంలో కూడా ఓటర్లను ఆకర్షించేందుకు డబ్బులు, మద్యం పంపకానికి దిగడం ఇదే మొదటిసారి. పట్టభద్రుల నియోజకవర్గంలో ఈ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని సర్వశక్తులు ఒడ్డాయి. ఎన్నికల ప్రచారంలో హేమహేమీలు పాల్గొన్నారు. రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్ ఎన్నికల సభలలో పాల్గొనగా, రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కరీంనగర్లో మకాం వేసి అన్నివర్గాలను ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశారు.
మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖలు సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. చివరి రోజున మంత్రులు విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెస్ కేవలం పట్టభద్రుల నియోజకవర్గం నుంచే అభ్యర్థిని బరిలో ఉంచింది. ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎవరిని పోటీలో ఉంచలేదు. బీజీపీ మాత్రం పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను బరిలో నిలిపింది.
పార్టీ రాష్ర్ట అధ్యక్షులు కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ఎంపీలు రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, పార్టీ ఎమ్మెల్యేలు విస్తృతంగా పర్యటించారు. బండి సంజయ్ కుమార్ కరీంనగర్లో మకాం వేసి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని కార్యకర్తల్లో జోష్ నింపారు. బీజేపీ ఉపాధ్యాయ నియోజకవర్గం అభ్యర్థి మల్క కొమురయ్య గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డారు. కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 56 మంది, ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి 15 మంది పోటీ పడుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అల్ఫోర్స్
నరేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి చెన్నమైల్ అంజిరెడ్డి, బీఎస్పీ తరపున ప్రసన్న హరికృష్ణ, అలిండియా కిసాన్ జనత పార్టీ అభ్యర్థిగా ఎల్ చంద్రశేఖర్, తెలంగాణ ప్రజాశక్తి పార్టీ తరపున దొడ్ల వెంకటేశం, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా సర్దార్ రవీందర్ సింగ్, విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్ధిగా జడ్సన్ బక్క, ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా మంద జ్యోతి, తెలంగాణ ద్రావిడ ప్రజల పార్టీ అభ్యర్ధిగా బొల్లి సుభాష్, నేషనల్ నవక్రాంతి పార్టీ అభ్యర్థిగా సిలివేరి ఇంద్రగౌడ్ లు బరిలో నిలిచారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు ధీటుగా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగిన ట్రస్మా నాయకుడు యాదగిరి శేఖర్ రావు, ముస్తాక్ అలీలు ప్రచారం నిర్వహించారు. వీరితోపాటు మరికొందరు స్వతంత్రులు కూడా తమ తమ ప్రాంతాల పరిధిలో ప్రచారం కొనసాగించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బీజేపీ నుంచి మల్క కొమురయ్య, పీఆర్టీయూ నుంచి వంగ మహేందర్ రెడ్డిలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.