15-04-2025 01:25:51 AM
ఇండస్ట్రియల్ పార్క్ భూ నిర్వాసితులకు అన్యాయం
దాదాపు 150 మంది రైతులకు అందని పరిహారం
అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామన్న డిప్యూటీ సీఎం
ఏడాదిన్నర దాటినా పట్టించుకోని వైనం
చేవెళ్ల, ఏప్రిల్ 14: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లి ఇండస్ట్రియల్ పార్క్ భూ నిర్వాసితులకు అన్యాయం జరుగుతోంది. చందనవెల్లితో పాటు హైతాబాద్, మాచన్పల్లి రైతుల నుంచి భూములు తీసుకున్న ప్రభుత్వం.. నేటికీ పరిహారం ఇవ్వడం లేదు. 2018లో భూ సేకరణ చేపట్టిన గత ప్రభుత్వం ఈ గ్రామాల్లో దాదాపు 500 మంది రైతుల నుంచి 2,000 ఎకరాల భూమిని తీసుకుని, టీఎస్‌ఐఐసీ ద్వారా కార్పొరేట్ కంపెనీలకు అప్పగించింది.
ఈ సమయంలో భూ సేకరణ చట్టం-2013 ప్రకారం 2018లో 200 మంది రైతులకు ఎకరాకు రూ.9 లక్షల చొప్పున, 2020లో మరో 150 మందికి రూ.10.50 లక్షల చొప్పున పరిహారం ఇచ్చి.. మిగతా 150 మంది రైతులకు మాత్రం మొండి చెయ్యి చూపిం ది. అంతేకాదు, ఈ రైతులు పరిహారం వచ్చేవరకైనా తమ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొద్దని అధికారులతో పాటు టీఎస్‌ఐఐసీకి వినతిపత్రాలు ఇచ్చినా కంపెనీలు పనులు ఆపడం లేదు.
పరిహారం పక్కదారి!
ఇండస్ట్రియల్ పార్క్ భూముల పరిహారం పక్కదారి పట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి ఇవన్నీ ఎస్సీ, బీసీ, మైనార్టీలకు చెందిన అసైన్డ్ భూములు. ఒక్కో రైతుకు 3 నుంచి 5 ఎకరాల వరకు ఉన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు లీడర్లు, రైతులకు కొంత విస్తీర్ణం ఇచ్చి.. మిగతాదిని తమ బినామీల పేరిట రాయించుకుని పరిహారం కొట్టేశారని భూ నిర్వాసితుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, వివిధ పనులు చేసుకుంటూ హైదరాబాద్లో నివాసం ఉంటున్న రైతుల భూములు కూడా కాజేశారని, ఇందులో అధికారుల ప్రమేయం ఉందని విమర్శిస్తున్నారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న అసలైన రైతులు గత నాలుగైదేళ్లుగా భూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో న్యాయం కోసం పోరాడుతున్నారు. అధికారులు, ప్రభుత్వ పెద్దలకు వినతిపత్రాలు ఇవ్వడంతో పాటు 2022లో నేషనల్ ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ను దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఫీల్ విజిట్ చేసి, రైతులకు 15 రోజుల్లో పరిహారం అందించాలని అప్పటి కలెక్టర్ అమేయ్ కుమార్ను ఆదేశించారు. అయినా ఎటువంటి చర్య తీసుకోలేదు.
హామీలు గాలికి..
2023లో పాదయాత్ర చేస్తూ షాబాద్కు వచ్చిన అప్పటి సీఎల్పీ లీడర్, ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారంలోకి వచ్చిన వెంటనే అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంతో పాటు రైతులకు పరిహారం అందిస్తామని మాటిచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా, రైతులకు ఒక్క పైసా కూడా రాలేదు. ఈ కాలంలోనూ బాధితులు తమ పోరాటాన్ని ఆపలేదు. నాలుగు సార్లు సీఎం, డిప్యూటీ సీఎం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించారు. ఒక్కసారి శ్రీధర్ బాబును కలిశారు.
ఐదు సార్లు ఆర్డీవోకు, నాలుగు సార్లు రంగారెడ్డి కలెక్టర్కు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం శూన్యం. దీంతో ఫిబ్రవరి 12న ఇందిరాపార్కులో ధర్నా చేయడంతో పాటు, మార్చి 12న అసెంబ్లీ సమావేశాలకు 10 మంది ప్రతినిధులతో వెళ్లి తమ డిమాండ్లు వివరించారు. అక్కడ నిరసన తెలపడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. తమ పోరాటంలో ఇప్పటివరకు 10 మంది రైతులు గుండెపోటుతో చనిపోయారని, అయినా ప్రభుత్వం స్పందించలేదని నిర్వాసితులు వాపోయారు.
నిర్వాసితులకు న్యాయం చేయాలి
భూములు తీసుకున్న గత ప్రభుత్వం దాదాపు 150 మంది రైతులకు పరిహారం ఇవ్వలేదు. పరిహారం వచ్చినవాళ్లకు కూడా అరకొరే వచ్చింది. మిగతాదిని కొందరు లీడర్లు తినేశారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా న్యాయం చేస్తుందని ఆశించాం. గత ఎన్నికల ముందు ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ కూడా ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. ఇప్పటికైనా సర్వం కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం.
-నీరటి ఆంజనేయులు, భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు