calender_icon.png 25 November, 2024 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాణం పోయిన, తల తెగిన దళితులకు అండగా ఉంటా

06-11-2024 05:57:48 PM

9న టెంట్ వేసుకొని ఇంటి వద్ద ఉంటా దరఖాస్తులు ఇవ్వండి

రైతు పండించిన ప్రతి గింజ కొనాలి, బోనస్ ఇవ్వాలి

హుజురాబాద్ (విజయక్రాంతి): దళిత బంధు విషయంలో తన ప్రాణం పోయిన తల తెగిన దళితులకు అండగా ఉంటానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం హుజరాబాద్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం పాయిలెట్ ప్రాజెక్టుగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి హుజురాబాద్ లోని సుమారు 20వేల కుటుంబాలను ఆదుకున్నారని అన్నారు. రెండో విడత దళిత బంధు డబ్బులు వారి అకౌంట్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అకౌంట్లను ఫ్రీజ్ చేసి దళితులను దగా చేస్తుందన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి బట్టి విక్రమార్క దళిత బంధు రెండో విడత ఎందుకు ఆపుతున్నారు చెప్పాలని ఆయన ప్రశ్నించారు.  ఈనెల 9న తాను హుజురాబాద్ లోని ఇంటి వద్ద టెంట్ వేసుకొని ఉంటానని, దళిత బంధు రెండో విడత రాని వారంతా వచ్చి తమ దరఖాస్తులు నేరుగా ఇవ్వాలని సూచించారు. దరఖాస్తులను కలెక్టర్ వద్దకు స్వయంగా తానే తీసుకువెళ్లి కలెక్టర్కు అందజేస్తానన్నారు. ఈనెల 20 లోపు దళితులందరికీ రెండో విడత దళిత బంధు ఇవ్వకుంటే కాంగ్రెస్ నాయకులను ప్రజాప్రతినిధులను నియోజకవర్గంలో తిరగనివ్వమని హెచ్చరించారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పండించిన పంటను గింజ కూడా కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడంతో ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయించి ధాన్యాన్ని అమ్ముకుంటున్నారని అన్నారు. ఒక్కో రైతు క్వింటాల్ పై 900 రూపాయల వరకు నష్టపోతున్నారని అన్నారు.

సన్న వడ్లను గుర్తించేందుకు కొత్తగా మిషన్లు తీసుకువచ్చి దానిలో ఒక గింజను వేసి నిర్ధారించడం ఎంతవరకు సరైందని ఆయన అన్నారు. రైతులను రుణమాఫీ, బోనస్, రైతు బీమా, రైతు భరోసా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దిగముంచిందన్నారు. ప్రభుత్వం వెంటనే రైతులను అన్ని విధాల ఆదుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, నాయకులు కౌన్సిలర్లు అపరాధ ముత్యం రాజు, తాళ్లపల్లి శ్రీనివాస్ కొండ్ర నరేష్, తొగరు సదానందం, మారపల్లి సుశీల, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.