26-03-2025 12:15:14 AM
స్టార్ బ్యూటీ పూజాహెగ్డే ప్రస్తుతం సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా దాదాపు అన్ని ఇండస్ట్రీల్లో హవా కొనసాగిస్తోంది. ఆ మధ్య కాస్త జోరు తగ్గినప్పటికీ మళ్లీ ఇప్పుడు ఈ మరాఠీ ముద్దుగుమ్మ పాన్ ఇండియా హీరోయిన్‌గా రాణిస్తోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న పూజ తన జీవితంలోని చేదు అనుభవాలను పంచుకుంది.
సామాజిక మాధ్యమాల్లో తన గురించి తప్పుగా ప్రచారం చేశారని, ఆ ట్రోల్స్ తన కుటుంబాన్ని చాలా ఆవేదనకు గురిచేశాయని తెలిపింది. ‘నటిగా నా ఎదుగుదలపై దెబ్బ కొట్టాలన్న దురుద్దేశంతో కొందరు నన్ను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. అందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికీ వెనుకాడలేదు. నేనెవరికీ చెడు చేయలేదు.
అయినా ఎందుకు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారో తెలియలేదు. నాకు వ్యతిరేకంగా ట్రోలింగ్స్ ఆపేయడానికి డబ్బు ఇవ్వాలంటూ కొందరు నన్ను సంప్రదించినప్పుడు అసలు విషయం నాకు అర్థమైంది. అయితే, కొంతకాలం తర్వాత నేనే ఆ ట్రోలింగ్స్ పట్టించుకోవడం మానేశా. ఇప్పుడు నా దృష్టి అంతా సినిమాలపైనే’ అని చెప్పుకొచ్చింది.
ఇక పూజా హెగ్డే సినిమాల విషయానికొస్తే.. హీరో సూర్య సరసన నటించిన ‘రెట్రో’ మే 1న విడుదలకు సిద్ధంగా ఉంది. దళపతి విజయ్ చివరి చిత్రం ‘జననాయగన్’లోనూ ఈ భామ నటిస్తోంది. రాఘవ లారెన్స్‌తో ‘కాంచన4’లో జత కట్టనుంది.
వీటితోపాటు తాజాగా రిషికేశ్‌లో ప్రారంభోత్సవం జరుపుకున్న మరో కొత్త సినిమాలోనూ పూజ కథానాయికగా నటిస్తోంది. వరుణ్ ధావన్ కథానాయకుడిగా ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్, శ్రీలీల మరికొందరు బాలీవుడ్ తారాగణం భాగమవుతున్నారు.