calender_icon.png 23 September, 2024 | 3:04 AM

వాళ్లంతా నాకు క్షమాపణ చెప్పాలి

23-09-2024 12:43:19 AM

ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు నటి సిమ్రాన్. పెళ్లి తర్వాత ఈమె తెలుగు ఇండస్ట్రీకి దాదాపుగా దూరమైందనే చెప్పాలి. అయితే ఇటీవల తమిళ చిత్రాల్లో అడపాదడపా వివిధ పాత్రలు చేస్తోంది. అలా నటిగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే మరొకవైపు నిర్మాణ రంగంలోకీ అడుగుపెట్టింది. ఈ క్రమంలో కోలీవుడ్ హీరో విజయ్ 69వ చిత్రాన్ని సిమ్రాన్ తన ప్రొడక్షన్ హౌస్‌లో చేయబోతోందనే వార్తలొచ్చాయి. తన ప్రొడక్షన్‌లో విజయ్‌తో సినిమా చేయాలని ఆశపడ్డ సిమ్రాన్.. ఆయన్ను సంప్రదిస్తే సున్నితంగా తిరస్కరించారంటూ రూమర్స్ వచ్చాయి. ఈ వార్తలు కాస్త సిమ్రాన్ వరకు చేరడంతో ఆమె ఒక సుదీర్ఘ ప్రకటనను విడుదల చేశారు. ‘నాపై ఎన్నో రూమర్స్ సృష్టించారు.

అయినా సరే ఇప్పటివరకు నేను మౌనంగానే ఉన్నా. ఇకపై అలా కుదరదు. ఇప్పుడు పెద్ద హీరోలతో కలిసి పనిచేయాలని నేను అనుకోవడంలేదు. పెద్ద హీరోలతో ఒకప్పుడు నటించా. ఇప్పుడు నా లక్ష్యం, గమ్యం వేరు. ఒక స్త్రీగా నా పరిమితులు నాకుంటాయి. అవేవో నాకు తెలుసు. ఇవన్నీ ఆలోచించకుండా గతంలో నన్ను ఇంకొకరితో లింక్ చేసి ఎఫైర్ రూమర్స్ సృష్టించారు. అప్పుడు నేను సింగిల్‌గానే ప్రశాంతంగా ఉన్నా. కానీ తప్పుడు ప్రచారాలు నన్ను మరింత మానసికంగా ఇబ్బందికి గురిచేశాయి.

ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు వెంటనే స్టాప్ అనే పదం ఉపయోగించి, నేను రూమర్స్‌కు చెక్ పెట్టి ఉండాల్సింది. కానీ అప్పట్లో నేను ప్రయత్నించలేదు. నేనే కాదు ఎవరూ వాటిని ఆపే ప్రయత్నం చేయలేదు. నా భావాలను ఎవరూ గౌర వించలేదు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఏది సరైందో దానికే నేను కట్టుబడి ఉన్నా. ఇండస్ట్రీ వ్యక్తుల నుంచి కూడా నేను అదే ఆశిస్తున్నా. ఎవరైతే నాపై పుకార్లు చేస్తున్నారో.. వారంతా నాకు క్షమాపణలు చెప్పాలి. ఇకనైనా రూమర్స్ ఆపాలి. లేకపోతే కఠిన చర్యలు తప్పవు’ అంటూ చాలా ఎమోషనల్ అవుతూ పోస్ట్ చేసింది సిమ్రాన్.