calender_icon.png 26 December, 2024 | 3:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆస్తి పంచుకున్నారు.. అంత్యక్రియలకు లేరు

26-12-2024 03:18:16 AM

  • 7 గంటలపాటు అంబులెన్సులోనే వృద్ధురాలి మృతదేహం
  •  కోట్ల ఆస్తి ఇచ్చినా కరగని రాతి గుండెలు
  • అంతిమసంస్కారాలు నిర్వహించిన స్థానికులు
  • జగిత్యాలలో అమానవీయ ఘటన

జగిత్యాల, డిసెంబర్ 25 (విజయక్రాంతి): తాను కన్న పిల్లలు లేకున్నా తన చెల్లెలి పిల్లలే తన పిల్లలుగా భావించి, అవసాన దశలో తనను చూస్తారని ఓ వృద్ధురాలు తమకున్న ఆస్తినంతా రాసిచ్చింది. ఆస్తిని తీసుకున్న ఆ పిల్లలు.. ఆ వృద్ధురాలు చనిపోతే అంతిమసంస్కారానికి కూడా రాలేదు. ఈ అమానవీయ ఘటన జగిత్యాలలో బుధవారం చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సాదుల లక్ష్మణ్, ధర్మపురి ఇరువురు అన్నదమ్ములు.

లక్ష్మణ్, సత్యమ్మ (90) దంపతులకు పిల్లలు లేకపోవడంతో ధర్మపురి వద్దే ఉంటూ జీవించారు. ఈ అన్నదమ్ములిద్దరికీ కలిపి జగిత్యాలలో ఐదు ఇండ్లు, కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తులున్నాయి. లక్ష్మణ్ దంపతుల వాటాను ధర్మపురి ఇద్దరి కుమారులు ప్రసాద్, రవి సమానంగా పంచుకున్నారు. 2002లో లక్ష్మణ్ మృతి చెందాడు. అప్పటి నుంచి ప్రసాద్, రవిల వద్ద సత్యమ్మ వంతుల వారిగా ఒక్కో నెల ఉంటున్నది. కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురైన సత్యమ్మను ఆసుపత్రిలో చేర్పించగా మంగళవారం సాయంత్రం మరణించింది. ప్రస్తుతం నెలవారి వంతులో భాగంగా ప్రసాద్ వద్ద ఉండగా, ఆయన ఇంట్లో శుభకార్యం ఉందన్న కారణంతో అంత్యక్రియలు చేయడానికి ముందుకు రాలేదు. 

రవి కూడా అంత్యక్రియలకు ముందుకు రాలేదు. మృతదేహాన్ని కూడా ఇంటి ముందు ఉంచేందుకు అంగీకరించలేదు. మంగళవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు మృతదేహం అంబులెన్స్‌లోనే ఉంచారు. చివరికి కాలనీవాసులు కలుగజేసుకుని సత్యమ్మ పాత ఇంటి తాళం పగులగొట్టి, రాత్రంతా మృతదేహాన్ని ఉంచారు. బుధవారం అంత్యక్రియలు చేయడానికైనా రావాలని ఆ అన్నదమ్ములను పిలిచినా రాలేదు. దీంతో కాలనీవాసులే అదే అంబులెన్స్‌లో మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించి, అంత్యక్రియలు నిర్వహించారు.