వారిది మ్యాచ్ ఫిక్సింగ్ మోసం
బ్యాగులు సర్దుకుని రెడీగా ఉన్నారు
ఏఐసీసీలో చోటు గురించి ఆతృత లేదు
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
ఖమ్మం, నవంబర్ 9 (విజయక్రాంతి): గత ప్రభుత్వంలో పేదల సొమ్మును దోచుకుని దేశాన్ని దాటించి, పంచుకున్నారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని ప్రజలను మోసం చేశారని విమర్శించారు. శనివారం కూసుమంచి తహసీల్దార్ కార్యాలయంలో 61 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఇటీవల వరదల్లో మృతి చెందిన షేక్ యాకూబ్, సైదాబీ దంపతుల కుమారులకు ఇండ్ల స్థలాల పట్టాలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడారు. ఉన్న మాటంటే మాజీ మంత్రులు, గత ప్రభుత్వంలో పని చేసిన పెద్దలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. పలాయనం చిత్తగించేందుకు బ్యాగులు సర్దుకుని రెడీగా ఉన్నట్టు అర్థమవుతున్నదని పేర్కొన్నారు. గులాబీ దండు అవినీతి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.
డిసెంబర్‌లో గ్రూప్ ఉద్యోగులకు అపాయింట్‌మెంట్లు
ప్రజా ప్రభుత్వం వచ్చిన 10 నెలల వ్యవధిలోనే 57 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని మంత్రి పొంగులేటి చెప్పారు. గ్రూప్ వన్, గ్రూప్ 2, గ్రూప్ 3లో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు డిసెంబర్ నెలలో అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, వ్యవసాయ సహాయ సంచాలకులు సరిత పాల్గొన్నారు.
కల్లాల వద్ద ఫొటోలకు ఫోజులిస్తే సరిపోదు
ప్రతిపక్ష నేతలు కల్లాల వద్ద ఫొటోలకు ఫోజులిస్తే సరిపోదని పొంగులేటి ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని తమ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. మహిళలకు సంబంధించి ఒకటి రెండు వాగ్ధానాలు ఆగిన సంగతిని ధైర్యంగా అంగీకరిస్తున్నామని, వాటిని కూడా అమలు చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం ధనిక రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించి, ప్రజల నెత్తిన రూ.7 లక్షల 18వేల కోట్ల అప్పులు రుద్దిందన్నారు. ఆ అప్పులు తీరుస్తూనే తాము ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు.
కుటుంబ సర్వేపై అభద్రత వద్దు
ప్రతిపక్షాలు కుటుంబ సర్వేపై రాద్ధాంతం చేస్తున్నాయని అవన్నీ తప్పని పొంగులేటి మండిపడ్డారు. భవిష్యత్‌లో ప్రజలకు ఏమీ చేయాలో ప్రణాళికను సిద్ధం చేసేందుకు సర్వే తోడ్పడుతుందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన సర్వే తప్పుల తడకలతో ఉందన్నారు. ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య అంశాల్లో ప్రగతి కోసం కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని పొంగులేటి చెప్పారు.
కాగా తాను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి 14 నెలలు మాత్రమే అయిందని, అతి తక్కువ కాలంలో తనకు పార్టీ ఎంతో ఇచ్చిందని పొంగులేటి చెప్పారు. అప్పుడే ఏఐసీసీలో ప్రాధాన్యం, చోటు గురించి ఆతృత లేదన్నారు. డిసెంబర్ నాటికి పూర్తి రుణమాఫీ
ఇందిరమ్మ రాజ్యంలో రైతును రాజు చేస్తున్నామని రాష్ట్ర రెవిన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వరి సాగు చేసిన రైతులు నిర్భయంగా ఉండాలని, చివరి గింజ వరకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రూరెండు లక్షల వరకు రుణాలు ఉన్న రైతులకు రూ.18వేల కోట్ల మాఫీ చేశామని, మరో రూ.13వేల కోట్ల మాఫీ చేయాల్సి ఉందని, డిసెంబర్ నెలాఖరు నాటికి మాఫీ చేస్తామని మంత్రి చెప్పారు.