23-04-2025 12:01:20 AM
కర్ణాటక మాజీ డీజీపీ హత్య కేసులో మరో షాకింగ్ విషయం..
ఎలా చంపాలన్న దానిపై ఐదు రోజుల పాటు పరిశోధన..
14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి భార్య పల్లవి..
బెంగళూరు: కర్ణాటకలో సంచలనం సృష్టించిన మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. తాజాగా గూగుల్‌లో వెతికి మరీ ఓం ప్రకాశ్‌ను భార్య పల్లవి హతమార్చినట్టు పోలీసులు తమ దర్యాప్తులో పేర్కొన్నారు. తన భర్త తనపై విష ప్రయోగం చేశారని, ఆ హింసను భరించలేకనే ఓం ప్రకాశ్‌ను హత్య చేసినట్టు పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. దీంతో కోర్టు పల్లవిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది. పోలీసుల వివరాల ప్రకారం.. హత్య చేయడానికి ముందు ఎలా చంపాలి అన్న దానిపై పల్లవి ఐదు రోజులు గూగుల్‌లో పరిశోధన చేసినట్టు తెలిపారు. ఎక్కడ నరాలు తెగితే మనిషి త్వరగా చనిపోతాడో తెలుసుకున్నట్టు వెల్లడించారు.
ఓం ప్రకాశ్‌ను భార్య పల్లవి, కుమార్తె కృతి పక్కా పథకం ప్రకారమే కడతేర్చినట్టు పేర్కొన్నారు. ఓం ప్రకాశ్ కుమారుడు కార్తికేశ్ ఇచ్చిన వాంగ్మూలంలో అతడి తల్లి పల్లవి స్కిజోఫ్రెనియా అనే మానసిక సమస్యతో బాధపడుతున్నట్టు పేర్కొన్నారు. తన భర్త నుంచి ప్రాణహాని ఉన్నట్టు పల్లవి ఊహించుకుందన్నారు. ఈలోగా ఆస్తి వివాదంతో పాటు భర్త ఓం ప్రకాశ్‌కు మరో మహిళతో సంబంధం ఉందంటూ కుటుంబ వాట్సాప్ గ్రూపుల్లో కొన్ని రోజులుగా ఆమె సందేశాలు ఉంచుతూ వస్తోంది.
సొంత ఇంట్లోనే బంధించారని, నిరంతర నిఘాలో ఉండడంతో ఆమె మానసిక వ్యాధి మరింతగా పెరిగి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు ఒక నిర్థారణకు వచ్చారు. ఓం ప్రకాశ్ హత్యకు పల్లవి మానసిక స్థితి ఎంత కారణమో.. ఆస్తి గొడవలు అంతే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఓం ప్రకాశ్ భార్య, కుమార్తె వద్ద కంటే కుమారుడు కార్తికేశ్‌తో ఉండేందుకే ఎక్కువ ఇష్టపడేవారు. తన పేరున ఉన్న 17 ఎకరాల భూమిని కుమారుడికి, చెల్లెలికి రాసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని తట్టుకోలేకపోయిన భార్య పల్లవి, కుమార్తె కృతి ఓం ప్రకాశ్‌తో నిత్యం గొడవ పడేవారు. చివరకు అది ప్రాణాలు తీసే స్థాయికి చేరినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.