85 శాతం మంది ఉద్యోగుల్లో ఇదే భావన ఉంది: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల
శాన్‌ఫ్రాన్సిస్కో: ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ నెలకొన్న సమస్యపై ఆ సంస్థ సీఈఓ సీఈఓ సత్య నాదెళ్ల స్పందించారు. మైక్రోసాఫ్ట్ ఉత్పాదకత సమస్యలతో పెనుగులాడుతోందని వ్యాఖ్యానించారు. లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్‌మన్ తో ముచ్చటించిన ఆయన మేనేజర్లు, ఉద్యోగులు అందించిన నివేదికపై మాట్లాడారు. కొవిడ్ మహమ్మారి విజృంభణ తర్వాత పని ప్రదేశాల్లో ఉన్న విధివిధానాలు, రిమోట్ వర్క్ సవాళ్లతో ఉత్పాదక సమస్యలు వెంటాడుతున్నాయని సత్య నాదెళ్ల వెల్లడించారు. ‘85 శాతం మంది ఉద్యోగులు సరిగా పనిచేయడం లేదని మేనేజర్లు భావిస్తున్నారు. ఆ సమయంలో 85 శాతం మంది ఉద్యోగులు తాము ఎక్కువగా కష్టపడినట్లు చెబుతున్నారు.
ఇలాంటి డేటా మా వద్దకు వచ్చింది. దీంతో ఒకే విషయాన్ని ఇరు కోణాల్లో ఎలా చూడాలనే విషయంపై చర్చిస్తున్నాం. వీరి నుంచి వచ్చిన డేటాను ఉపయోగించి ఈ సమస్యపై దృష్టిసారిస్తాం’ అని నాదెళ్ల అన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఓ మార్గం ఉందన్నారు. లక్ష్యాలను ఎలా నిర్వర్తించాలన్న విషయాన్ని లీడర్లు అర్థం చేసుకోవాలన్నారు. ‘నాయకులుగా ఉంటూ లక్ష్యాన్ని చేరుకొనేందుకు పాటించాల్సిన విధివిధానాల గురించి మనం అర్థం చేసుకోవాలి.
దానికి సంబంధించిన వివరాలను తెలియజేయాలి. వాటిని అమలుచేసి చూడాలి. ఒకవేళ అమలుచేస్తున్న విధానాలు వ్యర్థం అనుకుంటే కొత్త నియమాలు తీసుకురావాలి’ అని ఆయన అన్నారు. ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఇండస్ట్రీ లీడర్లకు సూచించారు. ప్రస్తుత ప్రపంచానికి ఉన్నతమైన నాయకులు, శక్తిమంతమైన లీడర్ల అవసరం ఉందని తాను భావిస్తున్నట్లు నాదెళ్ల తెలిపారు. ఎలాం టి పరిస్థితిలోనైనా స్పష్టతతో ముందుకెళ్లి సమస్యలను పరిష్కరించగల నాయకులు కావాలన్నారు.