రావు రమేశ్ కథానాయకుడిగా రూపొందిన ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’లో ఆయన కుమారుడిగా అంకిత్ కొయ్య నటించాడు. సుకుమార్ భార్య తబిత సమర్పణలో విడుదలవుతున్న ఈ చిత్రాన్ని పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా అంకిత్ కొయ్య మీడియాతో చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే... “మారుతీనగర్ సుబ్రమణ్యం’ సినిమాలో నేను ఇంద్రజ కొడుకు క్యారెక్టర్ చేశా.
మేం మదర్ అండ్ సన్ రోల్స్ చేసిన మరో మూవీ ఇంకా విడుదల కాలేదు. అలా ఆమె నన్ను ఈ పాత్రకూ రిఫర్ చేశారు. సినిమాలో ‘నేను ఈ ఇంట్లో పుట్టలేదు, అల్లు అరవింద్ కొడుకును. అల్లు అర్జున్ మా అన్నయ్య’ అని చెప్తుంటా. ఈ క్యారెక్టర్‌తో మంచి వినోదం పండుతుంది. ఇటీవల అల్లు అరవింద్‌ను కలిశా. అప్పటికే ఆయన ట్రైలర్ చూశారు. అందుకే ‘ఏవయ్యా.. నా కొడుకు అని చెప్పుకొని తిరుగుతున్నావట’ అని సరదాగా అన్నారు.
అల్లు ఫ్యామిలీకి, నాకు ఏదో కనెక్షన్ ఉందేమో! అల్లు అర్జున్‌తో ఓఎల్‌ఎక్స్ యాడ్ చేశా. అల్లు అరవింద్ బ్యానర్‌లో ‘ఆయ్’ చేశా. ఈ ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ సినిమాలో అల్లు ఫ్యామిలీ మెంబర్ అని చెప్పే రోల్ చేశా. ఇటీవల నేను నటించిన ‘ఆయ్’ విజయం సాధించింది. అది ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’తో కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నా” అన్నాడు.