calender_icon.png 23 November, 2024 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెడ్ కార్పెట్ వేశారు X గుంటభూమి ఇవ్వలే

23-11-2024 12:50:43 AM

రెడ్ కార్పెట్ వేశారు

  1. కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు అదానీని అరెస్ట్ చేయాలంటారు.. 
  2. తెలంగాణలో మాత్రం సీఎం పెట్టుబడులు ఆహ్వానిస్తారు
  3. అదానీ అవినీతిపరుడైతే సీఎం నీతిపరుడెలా అవుతారు ?
  4. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): అదానీ అక్రమాలపై ఆయనను అరెస్ట్ చేయాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ డిమాండ్ చేస్తుంటే, తెలం గాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రెడ్ కార్పెట్ వేస్తున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 

అదానీతో దేశానికి హాని జరుగుతుందని అగ్రనేతలు గగ్గోలు పెడుతుంటే, ఆయన పెట్టుబడులతో తెలంగాణకు ఎలా మేలు జరుగుతోందో చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. సీఎం రేవంత్‌కు చిత్తశుద్ధి ఉంటే అదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ఢిల్లీలో ఒక విధంగా, గల్లీలో మరో విధంగా వ్యవహరిస్తుందని విమర్శించారు.  కెన్యా వంటి దేశాలే ఒప్పందాలు రద్దు చేసుకున్నాయని, సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు రద్దు చేసుకోలేకపోతున్నారని నిలదీశారు. అదానీతో తెలంగాణ ప్రభు త్వం చేసుకున్న ఒప్పందాలపై ఇక్కడి బీజేపీ వైఖరి ఎంటో తెలియజేయాలని డిమాండ్ చేశారు.

బీజేపీ నేతలు నోరు మెదపడం లేదంటేనే ఈ వ్యవహారంలో బీజేపీ, కాంగ్రెస్‌ల వైఖరి బట్టబయలవుతున్నదని స్పష్టం చేశారు. ఈ విషయంపై ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేత అమిత్‌షా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అదానీపై కేసు పెట్టాలని, జేపీసీ వేయాలనే డిమాండ్ ఉన్నప్పటికీ, ప్రధాని మోదీ నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు.

అమెరికా కోర్టు అదానీ లంచాలు ఇచ్చిన ఉదంతాన్ని వెల్లడించిందన్నారు. అదానీ అవినీతిపరుడైతే సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు అవినీతిపరుడు కాకుండా పోతారని ప్రశించారు. గతంలో హిండెన్ బర్గ్ సంస్థ కూడా అవకతవకలను ప్రపంచానికి చెప్పిందన్నారు. అదానీ అంశం కారణంగా భారత్ ప్రతిష్ఠ అంతర్జాతీయంగా మసకబారిందని అభిప్రాయపడ్డారు. 

రాష్ట్రప్రభుత్వం అదానీతో రూ.12,400 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకుందని, వాటిలో రూ.5 వేల కోట్లు గ్రీన్‌ఎనర్జీ, రూ. 5 వేల కోట్లు డేటా సెంటర్, సిమెంట్ పరిశ్రమలకు ఒప్పందాలు ఉన్నాయన్నారు. డిస్కంలను సైతం అప్పగించేందుకు సర్కార్ పాత బస్తీలో కరెంటు బిల్లుల వసూళ్ల డ్రామా చేసిందని,  రామన్నపేటలో సిమెంట్ పరిశ్రమ వద్దని ప్రజలు వ్యతిరేకిస్తున్నా పట్టించుకోలేదని గుర్తుచేశారు.

ఇప్పుడా సిమెంట్ ఫ్యాక్టరీ కారణంగా మూసీ కలుషితమవుతున్నదని మండిపడ్డారు. అదానీ స్కిల్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల విరాళం ఇచ్చారని, అదానీ తన వ్యాపారం కోసం ఏమైనా చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ చూసీచూడనట్లు వ్యవహరిస్తునదని ధ్వజమెత్తారు.

చిన్న కార్పొరేషన్ పదవికి కూడా లోకల్ నాయకత్వానికి హైకమాండ్ అనుమతి కావాలని, అలాంటిది అదానీతో ఒప్పందాలకు పార్టీ పెద్దల అనుమతి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అదానీతో ఒప్పందాలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా తెలంగాణ ప్రభుత్వం పునసమీక్షించాలని కోరారని గుర్తు చేశారు.

ఎమ్మెల్యేల ఫిరాయింపులపై స్పీకర్ ప్రసాదరావు పట్టించుకోకుంటే, తాము ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద్ పాల్గొన్నారు.

మూసీ ముడుపుల కోసం సీఎం రేవంత్ ఆరాటం 

గురుకుల విద్యార్థులు పట్టెడెన్నం కోసం పోరాటం చేస్తుంటే, సీఎం రేవంత్ మాత్రం మూసీ ప్రక్షాళనలో ముడుపుల కోసం ఆరాట పడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ‘ఎక్స్’లో మండిపడ్డారు. సీఎం నీలిమేఘాల్లో ఉండగా, నీలినీడల్లో గురుకులాల భవిష్యత్తు ఉందని అభివర్ణించారు.

కంచంలో పురుగుల అన్నం, పాము కాట్లు, కారణం లేని మరణాలతో విద్యార్థులు గోస పడుతుంటే సీఎం రేవంత్ మాత్రం అదానీతో దోస్తీ, అల్లుడి ఆస్తుల కోసం ఆరాట పడుతున్నారని ధ్వజమెత్తారు. విద్యాలయాల్లో కనీస వసతులు, సరిపడా మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే సీఎం మాత్రం లగచర్ల రైతులపై లాఠీలు ప్రయోగిస్తున్నారని దుయ్యబట్టారు. ఫార్మా పేరుతో భూ దందాకు తెగపడ్డారని నిప్పులు చెరిగారు. 

గుంటభూమి ఇవ్వలే

  1. అవినీతి ఆరోపణలు నిజమని తేలితే అదానీ పెట్టుబడులపై పునరాలోచిస్తాం
  2. ఇద్దరు ముగ్గురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు
  3. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ 

హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం అదానీకి రాష్ట్రంలో గుంట భూమి కూడా ఇవ్వలేదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. అదానీపై అవినీతి ఆరోపణలు నిరూపణ అయితే ఆయన పెట్టుబడులపై పునరాలోచిస్తామని తేల్చిచెప్పారు. పార్లమెంటరీ కమిటీ నివేదిక ప్రకారం ముందుకు వెళ్తామన్నారు.

అదానీ అవినీతి గురించి తమ నేత రాహుల్ మాటే తమ మాట అని చెప్పారు. చట్టానికి లోబడే సర్కార్ వ్యాపారాలను అనుమతిస్తుందన్నారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో శుక్రవారం ఎంపీలు సురేష్ షెట్కార్, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

చట్టరీత్యా వ్యాపారాలు చేసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అదానీ కంపెనీ స్కిల్ యూనివర్సిటీకి అదానీ రూ. 100 కోట్ల విరాళం ఇచ్చారని కొం దరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, ఆ కంపెనీ సీఎం రేవంత్ జేబులోకి ఇవ్వలేదని స్పష్టం చేశారు. అది కేవలం ప్రజావసరాలకు ఇచ్చిన విరాళమని స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రూ.50 కోట్ల  విరాళ మిచ్చినా ప్రభుత్వం స్వీకరిస్తుందన్నారు. బీఆర్‌ఎస్ నుంచి త్వరలో భారీగా కాంగ్రెస్‌లోకి చేరికలు ఉంటాయన్నారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి తిరుగుతున్న ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్‌లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్ తన అధికారాన్ని ఉపయోగించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటారన్నారు. బీఆర్‌ఎస్ ఈ విషయంలో సుప్రీం కోర్టును ఆశ్రయించినా తమకే న్యాయం జరుగుతుందన్నారు. తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని తెలిపారు.

అవినీతి అక్రమాల విషయమై సెబీ చైర్మన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ తొలగించాల్సి ఉందని, కానీ మోదీ ఎందుకు ఆ పనిచేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  చట్టారీత్యా వ్యాపారం చేసుకుంటే రాష్ట్రప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. పేద ప్రజల అభ్యున్నతే తమ  ప్రభుత్వ నిర్ణయమన్నారు.

అదానీపై ఆరోపణలపై తమ పార్టీ జేపీసీ వేయాలని కోరుతుదన్నదని, జేపీసీ ఏర్పాటై నిష్పక్షపాతంగా విచారణ జరిగితే మోదీ ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. అదానీ అవినీతి గురించి గతంలోనూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ నొక్కి చెప్పారని, కానీ.. ఎవరూ నాడు స్పందించలేదన్నారు.

దేశంలో ఇంత దోపిడీ జరుగుతుంటే ప్రధాని మోదీ ఎందుకు కళ్లు మూసుకున్నారో తెలియడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అదానీని తక్షణం అరెస్టు చేయించాలని డిమాండ్ చేశారు. మోదీ అధికారంలోకి వచ్చాక అదానీ, అంబానీ ఆస్తులు వేల కోట్లకు పెరిగాయన్నారు.

దేశంలో ఈడీ, సీబీఐ, ఈడీలు ప్రధాని మోదీ గుప్పెట్లో పని చేస్తున్నాయని ఆరోపించారు. 90 శాతం ఏజెన్సీ తనిఖీలు ప్రతిపక్ష నేతలపైనే జరిగాయని గుర్తుచేశారు. సమావేశంలో కాంగ్రెస్ నేతలు చరణ్ కౌషిక్ యాదవ్, నిజాముద్దీన్, కేతూరి వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.