- అంతర్రాష్ట్ర మహిళా దొంగల ముఠా అరెస్ట్
- కొన్నేళ్లుగా నగరంలోని దుకాణాల్లో వరుస చోరీలు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 13 (విజయక్రాంతి): నగరంలో దోపిడీలు, దొంగతనాలు పెరిగిపోతున్నాయి. పురుషులతో పాటు మహిళలు కూడా చోరీలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్‌లో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర మహిళల ముఠాను మంగళవారం సుల్తాన్‌బజార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌కు చెందిన ఐదుగురు మహిళలతో కూడిన ముఠా.. గత కొన్నేళ్లుగా హైదరాబాద్ నగరంలోని పలు దుకాణాల్లో ఒకేసారి గుంపుగా ప్రవేశించి కొనుగోలు చేస్తున్నట్లు నటిస్తూ.. దుకాణాల యజమానుల దృష్టి మరల్చి, విలువైన వస్తువులను దొంగిలిస్తున్నారు.
ఈ క్రమంలో సుల్తాన్‌బజార్‌లోని ఓ షాపింగ్‌మాల్‌ను టార్గెట్ చేసి.. అక్కడ ఓ ఎన్నారై మహిళ నుంచి బ్యాగ్ లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.14 వేల నగదుతో పాటు నకిలీ నగలు స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యులు నగరంలోని పలు ప్రాంతాలకు వెళ్లి దుకాణాదారుల దృష్టి మళ్లించి విలువైన వస్తువులను దొంగిలించడంతో పాటు బంగారు ఆభరణాల స్థానంలో నకిలీవి అమర్చి దోచుకెళా ్తరని పోలీసులు గుర్తించారు. దాదాపు 100 గంటల పాటు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన తర్వాత నిందితులను గుర్తించి అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు.