25-02-2025 02:39:00 AM
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకుండా మంత్రి ఉత్తమ్, జగ్గారెడ్డిలు అడ్డు తగిలారు
మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): “నేను కేంద్ర మంత్రి కాకుండా కొందరు అడ్డుకున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కాకుండా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జగ్గారెడ్డి అడ్డు తగిలారు” అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదర్శ్‌నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సోమవారం జరిగిన యాదవుల సమావేశంలో అంజన్‌కుమార్ యాదవ్ మాట్లాడారు. సోనియాగాంధీకి లల్లూ ప్రసాద్ చెప్పడం వల్లే తనకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి వచ్చిందన్నారు. అగ్ర కులాలకు చెందిన వారు ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎంపీగా పోటీచేసే అవకాశం ఇచ్చారన్నారు. జీవన్‌రెడ్డి ఓడిపోతే మళ్లీ టికెట్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.
పక్క పార్టీలో ఉన్న దానం నాగేందర్‌ను తీసుకొచ్చి ఎంపీ టికెట్ ఇచ్చారన్నారు. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ తనకు ఇస్తే గెలిచేవాణ్ని అని అన్నారు. కాగా ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ ఆదేశాల మేరకే రాష్ట్రంలో కుల గణన జరిగిందన్నారు. యాదవులకు పదవులు రాకుండా కొందరు అగ్రకుల నాయకులు అడు ్డపడుతున్నారని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని కూడా కొందరు అడ్డగించారని హాట్ కామెంట్స్ చేశారు. యాదవులకు కచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీపీసీసీ నాయకులు వజ్రేష్ యాదవ్, చరణ్ కౌశిక్ యాదవ్, గజ్జి భాస్కర్ యాదవ్ పాల్గొన్నారు.