calender_icon.png 8 April, 2025 | 9:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల పేరిట ధాన్యం అని చెప్పి బోనస్ నొక్కేశారు..

06-04-2025 08:09:27 PM

రైస్ మిల్లర్లు, పోచారం తనయుడు కుమ్మక్కై కుంభకోణానికి పాల్పడ్డారు..

రాష్ట్ర మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఎలమంచిలి శ్రీనివాసరావు..

బాన్సువాడ (విజయక్రాంతి): రైతుల పేరున ధాన్యం అమ్మినట్లు కొందరు రైస్ మిల్లర్లు పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు భాస్కర్ రెడ్డిలు కుమ్మక్కై ప్రభుత్వం ఇచ్చిన బోనస్ డబ్బులను నొక్కేశారని రాష్ట్ర మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఎలమంచిలి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ఆయన కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానంగా కొందరు రైస్ మిల్లర్లు పోచారం శ్రీనివాసరెడ్డి అనుచరులు కుమ్మక్కై రైస్ మిల్ ధాన్యాన్ని రైతుల పేరిట ధాన్యం అని చెప్పి రైతులకు చెల్లించాల్సిన బోనస్ డబ్బులను కుంభకోణం చేశారని ఆరోపించారు.

దీనిపై అధికారులు, ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చిన బోనస్ డబ్బులను నొక్కేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో అటు బోధన్ ఎమ్మెల్యే షకీల్, పోచారం శ్రీనివాసరెడ్డి కుమారుడు భాస్కర్ రెడ్డి (జిల్లా సహకార బ్యాంకు చైర్మన్) ల కనుసన్నల్లో పెద్దఎత్తున ధాన్యం కుంభకోణం జరిగిందని అన్నారు. మళ్ళీ అదే పునరావృతం కాకుండా చూడాలని అధికారులను కోరారు. లేనిపక్షంలో పెద్దఎత్తున కార్యకర్తలతో వెళ్లి కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అవసరమైతే పాలకపక్షంలో ఉండి కూడా ప్రతిపక్షంలా పోరాడుతామని  పోచారం శ్రీనివాసరెడ్డి, పోచారం భాస్కర్ రెడ్డిలను హెచ్చరించారు.

అలాగే ఎంతో కష్టపడి తెచ్చుకున్న ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి చెడ్డపేరు తెచ్చే పనులు చేయకూడదని కార్యకర్తలు, నాయకులకు హితవు పలికారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ గంగాధర్ దేశాయ్, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ కమలాకర్ రెడ్డి, జిల్లా మైనారిటీ కార్యదర్శి వహీద్ హుస్సేన్, మాజీ ఎంపీటీసీ సలీం, సీపీఐ నాయకుడు విఠల్ గౌడ్, మాజీ జడ్పీ కో ఆప్షన్ మెంబర్ వలియొద్దీన్, కాంగ్రెసు, సీపీఐ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.