calender_icon.png 4 April, 2025 | 10:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాసులిచ్చి భూమిని కాజేసిండ్రు

25-03-2025 01:21:37 AM

  • కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నా తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేసిండు

నా భూమి నాకు ఇప్పియ్యాలె సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో బాధితుడి ఆందోళన

హుస్నాబాద్, మార్చి 24 : రెవెన్యూ అధికారులకు కాసులిచ్చి తన భూమిని కాజేశారని ఓ రైతు ఆరోపించాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సర్వే నంబర్ 1239/డీ, 1239/ఈ, 1239/ఎఫ్ లో గల 4.2 ఎకరాల వ్యవసాయ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని  కాల్వల ఎల్లయ్య అనే రైతు  ఆందోళన చేశాడు.

తమ భూమికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో భూవివాద కేసు పెండింగ్లో ఉండగా, హుస్నాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో అక్రమంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేశారని ఆయన ఆరోపించాడు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగడంలేదని విలేకరుల ముందు ఆవేదన వ్యక్తం చేశాడు.

సదరు భూమి తన తండ్రి కాల్వల మల్లయ్య పేరు మీద ఉందని, దీనిని హుస్నాబాద్ కు చెందిన మల్లెత్తుల ఎల్లయ్య, మల్లెత్తుల లక్ష్మయ్య, మల్లెత్తుల సిద్ధయ్య కాజేశారన్నారు. వారు రెవెన్యూ అధికారులకు లంచం ఇచ్చి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించాడు. ఈ భూమికి సంబంధించి వారివద్ద ఎలాంటి పత్రాలు లేకపోయినా, అధికారులు వారి పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశాడు.

దీనిపై తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదన్నాడు. తమ భూమిపై తెలంగాణ హైకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నందున, ఈ అక్రమ రిజిస్ట్రేషన్ను రద్దు చేసి, తమ భూమిని తమకు తిరిగి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశాడు. దీనిపై తహసీల్దార్ రవీందర్ రెడ్డిని వివరణ కోరగా.. సర్వే నంబర్ 1239/డీ, 1239/ఈ, 1239/ఎఫ్ లో 4.2 ఎకరాల వ్యవసాయ భూమిని అనుభవిస్తున్న వారికే రిజిస్ట్రేషన్ చేశామన్నారు. దీనిపై కోర్టులో కేసు ఉన్న సంగతి తెలియదన్నారు.