calender_icon.png 25 October, 2024 | 3:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాపాలు చేస్తేనే పదవులు కోల్పోయారు

25-10-2024 01:46:06 PM

గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన విద్యావ్యవస్థ

పదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన గజ్వేల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ ను నెల రోజుల్లో బాగు చేస్తాం 

119 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ పాఠశాలలు ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి 

గజ్వేల్ పాలిటెక్నిక్ హాస్టల్లో నిద్ర  చేసి సమస్యలు తెలుసుకున్న ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరి ప్రీతమ్ 

గజ్వేల్ (విజయక్రాంతి): గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరి ప్రీతం అన్నారు. గురువారం రాత్రి  డిసిసి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి తో కలిసి ఆయన విద్యార్థులతో గడిపి సమస్యలను తెలుసుకున్నారు. శుక్రవారం ఉదయం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరి ప్రీతం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత కేసీఆర్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, ఎన్నో పాపాలు చేశారు కాబట్టి పదవులు కోల్పోయారన్నారు.

గజ్వేల్ లో తన గొప్పను చూపించుకోవడానికి ఎడ్యుకేషన్ హబ్ లను పైన పటారం లోన లొటారం అనే విధంగా నిర్మించారని, పక్కనే ఎక్కువ శాతం దళితులు చదువుకునే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల శిథిలావస్థలో ఉన్నా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. పాలిటెక్నిక్ కళాశాల వసతి గృహాలను క్షుణ్ణంగా పరిశీలించామని, పైకప్పులు పూర్తిగా శిథిలావస్థకు చేరాయని, క్రీడా సామాగ్రి లైబ్రరీలో పుస్తకాలు, కళాశాలలో తాగునీటి వసతులు కూడా కరువయ్యాయి అన్నారు. బాలవికాస్ తో మాట్లాడి  పది రోజుల్లో ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అనిల్ కుమార్ తదితరులతో మాట్లాడడం జరిగిందని ఎమ్మెల్సీ నిధులు 15 లక్షలతో  పైకప్పులు, ఇతర మరమ్మతులు చేయనున్నట్టు తెలిపారు. 

గత పదేండ్ల పాలనలో నమ్మి ఓట్లేసిన గజ్వేల్ ప్రజలను కెసిఆర్ మోసం చేశారని అన్నారు. కొల్గురు దళితుల ఇండ్లు కూల్చి ఒక్కటైనా నిర్మించలేదని, మిగులు బడ్జెట్ తో రాష్ట్రాన్ని అప్పగిస్తే ఆరు లక్షల కోట్లకు పైగా అప్పులతో అప్పగించారన్నారు. లిబర్టీ వద్ద అంబేద్కర్ విగ్రహానికి సుంద్రీకరణ పనులు చేస్తుంటే రాష్ట్రవ్యాప్తంగా గొడవలు పెట్టి కూల్చివేశారని ఆరోపించారన్నారు. పంజాగుట్ట వద్ద  అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే డంపింగ్ యార్డ్ పాలు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. 9 నెలలలోనే 119 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ లను నిర్మిస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డిదన్నారు. నైపుణ్యంతోనే ఉద్యోగాలు వస్తాయని స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు తక్కువ ఖర్చుతో నిర్మించాల్సి ఉండగా ఎలాంటి సమీక్షా సమావేశాలు చేయకుండానే లక్షన్నర కోట్లకు బడ్జెట్ ను దేనికి పనికిరాకుండా నిర్మించాలన్నారు. గజ్వేల్ పాలిటెక్ కళాశాలను స్టూడెంట్ మేనేజ్మెంట్ నుండి సోషల్ వెల్ఫేర్ కు మార్చడానికి నివేదికలు సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. కెసిఆర్ మనవడిని పాలిటెక్నిక్ కళాశాలలో ఒకరోజు నిద్రించాలని, విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు అర్థమవుతాయన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలో కనీసం విధి దీపాలు ఏర్పాటు చేయడానికి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి రాత్రి అధికారులతో మాట్లాడి అభివృద్ధి నిధులు రూ.5 లక్షల తో వీధి దీపాలు ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టారన్నారు.

30 లక్షలతో పాలిటెక్నిక్ లో అవసరమైన మౌలిక వసతులను నెల రోజుల్లో ఏర్పాటు చేస్తామన్నారు. పదేళ్లలో చేయని అభివృద్ధిని నెల రోజుల్లో చేసి చూపిస్తామన్నారు. అన్ని గురుకులాలను రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలించి ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కరిస్తామన్నారు. సమావేశంలో గజ్వేల్ ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్, వర్గల్ మాజీ ఎంపీపీ మోహన్, మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్,, నాయకులు  శేఖర్ గుప్త, ఆంజనేయులు, రామచంద్ర చారి రమేష్, జహీర్, సురేష్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.