calender_icon.png 26 November, 2024 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బతికుండగానే చంపేశారు

23-10-2024 01:53:28 AM

  1. తప్పుడు ఫౌతి కారణంగా ఐదేండ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్న రైతు
  2. తహసీల్దార్ కార్యాలయం ఎదుట పురుగుమందుతో ఆత్మహత్యాయత్నం
  3. సమస్య పరిష్కరిస్తామన్న తహసీల్దార్

గజ్వేల్, అక్టోబర్22: రైతుకు ఉన్న ఎకరం భూమిని అతనికి తెలియకుండా అధికారులే కాజేసిన సంఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరులో ఆలస్యంగా వెలుగుచూసింది. తన భూమి వేరొకరి పేరున అధికారులు మార్చారని తెలిసి ఆరైతు మంగళవారం పురుగుమందు డబ్బాతో తహసీ ల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

వివరాలు.. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరుకి చెందిన ఉప్పరి(సందిల) పోచయ్యకు గ్రామంలో ఎకరం రెండుగుంటల వ్యవసాయ భూమి ఉంది. అదే భూమిలో వ్యవసాయం చేసుకుంటూ పోచయ్య కుటుంబాన్ని పోషిస్తు న్నాడు. ఈ క్రమంలో 2019 లో రైతుబంధు రాకపోవడంతో తహసీల్దార్ కార్యాలయంలో తెలుసుకోగా తన పేరుమీద భూమి లేదని చెప్పారు.

అంతేకాకుండా తన పట్టాపాస్ పుస్తకంపై భూమి క్యాన్సిల్ అని స్టాంప్‌వేసి ఇచ్చారు. అధికారులను తన భూమిని ఎందుకు క్యాన్సిల్ చేశారంటూ అడుగగా అదే గ్రామానికి చెందిన ఉప్పరి(అనగాళ్ల) పోచయ్య కొడుకు రామస్వామి పేరున ఫౌతి అయ్యిందని చెప్పారు.

తాను బతికున్నా వేరేవారి పేరున తన భూమిని ఎలా మార్చు తారని అధికారుల ఎదుట పోచయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంటిపేర్లతో సహా తండ్రుల పేరు కూడా ఒకటే ఉన్నంత మాత్రాన అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా భూమిని ఫౌతి ఎలా చేశారని అధికారులను ప్రశ్నించాడు.

గత ఐదేండ్ల నుంచి ఇప్పటివరకు తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ ఇదే విషయమై ఎంత తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో పోచయ్య మంగళవారం పురుగుమందు డబ్బాతో తహసీల్దార్ కార్యాలయం లోకి వెళ్లి తన భూమి తనకు రికార్డు చేసి ఇవ్వాలని లేదంటే పురుగుమందు తాగి చస్తానని బెదిరించాడు. 

సమస్య పరిష్కరిస్తాం..

తహసీల్దార్ బాలరాజు పోచయ్యకు భూ రికార్డుల గురించి వివరించాడు. ఇద్దరి ఇంటిపేరు, తండ్రిపేర్లు ఒకేవిధంగా ఉండటం వల్ల గతంలో తప్పుడు ఫౌతి జరిగిందని తాను బాధ్యత తీసుకున్న వెంటనే సంబంధిత రికార్డును హోల్డ్ చేసి పెట్టినట్లు చెప్పారు. తిరిగి పోచయ్య పేరుమీద బదిలీ చేయడానికి ధరణిలో ఆప్షన్ లేకపోవడం వల్లే రికార్డును సరిచేయలేకపోతున్నట్లు తహసీల్దార్ వెల్లడించారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువె ళ్లామని.. వీలైనంత త్వరగా పరిష్కరించి భూరికార్డును సరిచేస్తామని హామీ ఇవ్వడంతో పోచయ్య తన కుటుంబంతో ఇంటికి వెళ్లిపోయాడు.