calender_icon.png 4 October, 2024 | 3:01 AM

రుణమాఫీ చేసి సీఎం మాట నిలబెట్టుకున్నారు

04-10-2024 01:01:12 AM

గతంలో రుణమాఫీ గురించి పట్టించుకోని వారు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు

గజ్వేల్ ఏఎంసీ పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో మంత్రులు తుమ్మల, పొన్నం 

గజ్వేల్, అక్టోబర్ 3: బీఆర్‌ఎస్ పార్టీ ప్రతి పనికి అడ్డుపడుతున్నా, సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్నారని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

గురువారం గజ్వేల్‌లో వ్యవ సాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. ఇప్పటికే 20 లక్షల మంది రైతులకు రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేశామని, మరో 20 లక్షల మంది రైతులకు రూ.18 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని, త్వరలో పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. గతంలో రుణమాఫీ అంటే పట్టించుకోని వారు కూడా ఇప్పుడు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

తెలంగాణ రైతుల కష్టాలు తీర్చే ప్రయత్నం చేయకపోయినా, కష్టాలు తీరుస్తున్న ప్రభుత్వానికి సహకరించాలని బీఆర్‌ఎస్ పార్టీకి సూచించారు. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు కల్పించినా రుణమాఫీ పూర్తి చేస్తామని, రైతు భరోసా అందిస్తామని వెల్లడించారు. రూ.600 కోట్లు ఖర్చు పెట్టి వ్యవసాయాన్ని యాంత్రీకరిస్తామని తుమ్మల హామీ ఇచ్చారు.

ఖమ్మం తర్వాత సిద్దిపేట వ్యవసాయంలో ముందుందని, ఆయిల్‌పామ్ సాగులోనూ ముందడుగు వేస్తుందన్నారు. జిల్లాలో ఏడాదిలో ఆయిల్‌పామ్ పరిశ్రమ ప్రారంభమవు తుందని, అన్ని జిల్లాల్లోనూ ఆయిల్‌పామ్ పరిశ్రమలు ఏర్పా టు చేయడానికి కృషి చేస్తామన్నారు. రైతుల కోసం డ్రిప్ పథకాలను కూడా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.

దేశ రైతులంతా బాగుండాల న్నది రాహుల్ గాంధీ కోరిక అని, ఆయన ఇచ్చిన హామీలన్నీ రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. భవిష్యత్‌లో గజ్వేల్ మార్కెట్‌కు, రైతులకు అవసరమైన సహకారం అందిస్తామని ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్ధార్‌ఖాన్‌కు హామీ ఇచ్చారు. 

గజ్వేల్ ఎమ్మెల్యే నర్సారెడ్డే : పొన్నం

కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పటివరకు ప్రజలకు కనబడడం లేదని, గజ్వేల్ ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్న మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డే గజ్వేల్ ఎమ్మెల్యే అని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైన కేసీఆర్ సభలోనిర్మాణాత్మక సలహాలు ఇవ్వకుండా, కనీసం సమావేశా లకు కూడా హాజరు కావడం లేదని ఆరోపించారు.

ఖమ్మం వరదల వల్ల రూ.10 వేల కోట్ల నష్టం వాటిల్లితే కేంద్ర ప్రభుత్వం రూ.400 కోట్లు మాత్రమే ఇచ్చిందని, అయినా బీజేపీని బీఆర్‌ఎస్ నాయకులు ఎందుకు ప్రశ్నించడం లేదన్నా రు. రాష్ట్రంలో గత ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పులు చేయడమే కాకుండా కొత్త ప్రభుత్వానికి రూ.47 వేల కోట్ల బకాయిలు చెల్లించే పరిస్థితి కల్పించిందన్నారు. ఒకటో తేదీ నుంచే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు మంత్రి పొన్నం వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, ఫిషరీస్ సంస్థ చైర్మన్ సాయికృష్ణ, తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ జ్యోతి కృష్ణ, ఫుడ్, హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్లు ఎలక్షన్‌రెడ్డి, భూంరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, ఏఎంసీ పాలకవర్గం, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.