- రేవంత్‌రెడ్డి.. ఒకసారి చరిత్రలోకి తొంగి చూడు
- పిచ్చి ప్రేలాపనలు మాని పాలనపై దృష్టి పెట్టు
- పార్టీ వీడని గులాబీ సైనికులకు వందనాలు
- ప్రజల గుండెల్లో స్థానం పొందిన నేత శాశ్వతం
- తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి రేవంత్ పదవి
- కార్తీక పౌర్ణమికి తుస్సుమన్న పొంగులేటి బాంబు
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు
హైదరాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి): కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్‌ను ఫినిష్ చేస్తామని సీఎం రేవంత్ అంటున్నారని.. కేసీఆర్ అంటే ఒక వ్యక్తికాదని శక్తి అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు అన్నారు. రేవంత్ మాదిరిగానే గత 24 ఏళ్లలో ఎంతో మంది ప్రగ్బలాలు పలికారని, పిచ్చి ప్రేలాపనలు చేశారని, కేసీఆర్‌ను ఖతం చేస్తామన్న వారే ఫినిస్ అయ్యారని చెప్పారు.
ఏంజరిగిందో చరిత్రలోకి తొంగి చూడాలని రేవంత్‌రెడ్డికి హితవుపలికారు. తెలంగాణ భవన్‌లో శనివారం నిర్వహించిన రాజేంద్రనగర్‌నగర్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లాద్రి నాయుడు, షేక్ అరిఫ్ తమ అనుచరులతో కలిసి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆయన వెంట పిడికెడు మంది మాత్రమే ఉన్నారని, నేడు లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారని చెప్పారు.
పదేళ్ల పాటు కేసీఆర్ పాలన అద్బుతంగా కొనసాగిందని పేర్కొన్నారు. అధికారం, పదవులు శాశ్వతం కాదని.. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న నాయకులు శాశ్వతమని చెప్పారు. ఆ స్థానం కేసీఆర్‌కు సొంతమని స్పష్టంచేశారు. పదవుల కోసం కొందరు ఎమ్మెల్యేలు పార్టీ వీడినా.. పార్టీని వదలిపెట్టకుండా ఉన్న గులాబీ సైనికులకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రం ఏర్పడిన మొదట్లో హైదరాబాద్‌కు పెట్టుబడులు రావని, హిందూ-ముస్లింలు గొడవలు జరుగుతాయని కొందరు ప్రచారం చేశారని గుర్తుచేశారు. కానీ, కేసీఆర్ అభివృద్ధే కులం, సంక్షేమమే మతం అన్నట్టు అభివృద్ధి చేసి అవన్నీ ప్రచారాలే అనే విధంగా చేశారని స్పష్టంచేశారు. రేవంత్ రెడ్డి టెక్నికల్ ప్రాబ్లమ్స్‌తో ఎత్తయిన కుర్చీలో కూర్చుంటు న్నాడని, అలా కూర్చుంటే పెద్దోళ్లు కాలేరని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ రైతుబంధు రూ.10 వేలు బిచ్చం వేసినట్టు వేస్తున్నాడని, తాము రూ.15 వేలు ఇస్తామని చెప్పి.. వానకాలం రైతు బంధు ఇవ్వకుండా ఎగ్గొట్టారని విరుచుకుపడ్డారు. కేసీఆర్ లక్ష రుణమాఫీ చేస్తే తాను రెండు లక్షలు చేస్తామని సోనియాగాంధీ బర్త్‌డే రోజు ప్రకటించీ ఏడాది అయిపోయిందని చెప్పారు. రేవంత్‌రెడ్డి.. సోనియాతోపాటు రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేశాడని మండిపడ్డారు.
ఏ దేవుని దగ్గరకు పోతే అక్కడ ఒట్లు వేసి, దేవుళ్లను మోసం చేసిన మొదటి వ్యక్తిగా మిగిలాడని అన్నారు. హైదరాబాద్ ప్రజలకు కాంగ్రెస్ నైజం తెలుసు కాబట్టి వాళ్లకు ఓటు వేయలేదని పేర్కొన్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడని, ఆయన వెళ్లిపోయినా సరే కార్యకర్తలే పార్టీ నడుపుతుండటం సంతోషంగా ఉందన్నారు.
జైల్లో పెట్టినా ప్రశ్నించడం ఆపం
ఏదో కేసులు పెట్టి జైల్లో పెడితే ప్రశ్నించటం మానేసే ప్రసక్తిలేదని, తాను జైలుకు పోతే వందలాది మంది కేసీఆర్, కేటీఆర్‌లు పుట్టుకొస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పడే పోరాటం మొదలైందని, మరో నాలుగేళ్లు ఈ కాంగ్రెస్ తో పోరాటం చేయాల్సి ఉందని చెప్పారు. అభివృద్ధి కోసం పార్టీ మారనంటున్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే.. కేసీఆర్ కన్నా రేవంత్‌రెడ్డి ఏం అభివృద్ధి చేసిండో చూపాలని నిలదీశారు.
ఎమ్మెల్యేలను బీజేపీ వాళ్లు మేకలను కొన్నట్టు కొంటున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేనే చెప్తున్నారని.. మీ మందలో కలిసిన మా మేకలను చూడాలని ఖర్గేకు చురకలంటించారు. ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీలకు సిగ్గు లేదని.. వారు ఏ పార్టీలో ఉన్నారో చెప్పే దమ్ము లేదని అన్నారు. రాజేంద్రనగర్‌లో ఉప ఎన్నిక వస్తుందని, ఆ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరటం ఖాయమన్నారు. కార్తీక్‌రెడ్డి రాజేంద్రనగర్‌ను భవిష్యత్‌లో అద్భుతంగా ముందుకు తీసుకెళ్లే నాయకుడని తెలిపారు.
మూసీ పేరుతో హస్తినకు రేవంత్ డబ్బుల మూటలు
మూసీ పేరుతో ఢిల్లీకి మూటలు పంపేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. మూసీ బాధిత ప్రాంతాల్లో తాము పర్యటించామని, రాజేంద్రనగర్ నియోజకవర్గంలో తిరిగితే ప్రజల ఆవేదన తెలుస్తుందని చెప్పారు. 40, 50 ఏళ్ల నుంచి ఉన్న భూములకు రిజిస్ట్రేషన్లు చేసి ట్యాక్స్‌లు కట్టించుకొని ఇప్పుడు కబ్జాదారులు అంటారని, కోట్ల విలువ చేసిన ఇళ్లను కూలగొట్టి ప్రజలను దిక్కులేని వాళ్లను చేస్తున్నారని మండిపడ్డారు.
బీజేపీ నేతలు రేవంత్ చేసిన సవాల్‌కు స్పందించి మూసీ బస్తీల్లో నిద్రచేయడం సంతోషకరం అన్నారు. 60 ఏళ్ల నుంచే మూసీలోకి మురికి నీళ్లు వస్తున్నాయని, మూసీని తామే మురికి కూపం చేసినట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మూసీ మురికి కూపానికి కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలే కారణమన్నారు.
తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి రేవంత్ సీఎం పదవి
‘మూసీ మే లూటో ఢిల్లీ మే బాటో’ అనే విధంగా కాంగ్రెస్ పాలకుల తీరు ఉన్నదని కేటీఆర్ అన్నారు. రేవంత్‌రెడ్డి పదవి తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిందని, ఢిల్లీ వాళ్లకు కోపం వస్తే పదవి ఎప్పుడు ఊడుతుందో తెలియదని చెప్పారు. బాపు ఘాట్ వద్ద అతి పెద్ద మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెడతామని చెప్తున్నారని, గాంధీ విగ్రహాన్ని అడ్డుపెట్టుకొని శిఖండి రాజకీయాలు చేస్తామంటే మంచిది కాదని హితవు పలికారు.
కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎం అయిపోయిందని అంటున్న ప్రధాని మోదీ.. విచారణ జరపకుండా మౌనంగా ఎందుకు ఉన్నా రని ప్రశ్నించారు. అమృత్ టెండర్ల గురించి ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు సమాధానం లేదని మండిపడ్డారు. రేవంత్‌ను విమర్శిస్తే బండి సంజయ్, రఘనందన్‌రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ధర్మపురి అర్వింద్ తట్టుకో లేకపోతున్నారని అన్నారు.
బాంబుల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అమావాస్యకు బాంబులు పేలిస్తే కార్తీక పౌర్ణమి నాటికి కూడా పేలుతలేని ఎద్దేవాచేశారు. పొంగులేటి ఇంటి మీద ఈడీ దాడులు జరిగి 45 రోజులు గడిచినా ఈడీ, బీజేపీ నేతలు ఒక్క ప్రకటన చేయకపోవడం వారి మధ్య ఉన్న బంధం అర్థం అవుతందని అన్నారు. రేవంత్‌రెడ్డితో తమకు గట్టు పంచాయితీ ఏమీ లేద ని, కొడంగల్‌లో గిరిజనుల భూమి గుంజుకోవటంపై ప్రశ్నిస్తే సీఎంకు కోపం వస్తోందన్నారు.