06-04-2025 12:00:00 AM
గర్భిణిగా ఉన్నప్పుడు బరువు పెరగడం, కాళ్లు, చేతుల్లో వాపు రావడం, ఊపిరాడనట్టు అనిపించడం, అలసట, ఛాతీలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవన్నీ సహజమేగా అనుకుంటారు చాలామంది. కాని కొన్నిసార్లు ఈ లక్షణాలు ‘పెరీపార్టమ్ కార్డియోమయోపతీ’ అనే గుండెజబ్బుకి సంకేతం కూడా కావచ్చని అని నిపుణులు చెబుతున్నారు. గర్భిణిగా ఉన్నప్పుడూ, ఆ తర్వాతా గుండె కండరాలు బలహీనపడి ఈ సమస్య ఏర్ప డుతుంది. అయితే ఈ పరిస్థితిపైన అవగాహ న లేక ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. దీనికి చెక్ పెట్టేందుకే ఎకో హెల్త్, మేయా క్లినిక్‌లు ‘ఏఐ పవర్ డిజిటల్ స్టెతస్కోప్’ ని రూపొందించాయి.
ఈ స్టెతస్కోప్ కేవలం 15 సెకన్ల వ్యవధిలోనే రోగి గుండె కొట్టుకునే వేగాన్ని విశ్లేషించి గుండె జబ్బుల్నీ, ఊపిరితిత్తుల సమస్యల్నీ ముందుగానే పసిగట్టేస్తుంది. అవును, ప్రత్యేకించి ఈసీజీలూ ఇతర పరీక్షలూ చేయాల్సిన అవసరం లేకుండానే ఈ ఏఐ స్టెతస్కోప్ గుండెకొట్టుకునే తీరులోని మార్పులను పసిగట్టి వ్యాధి నిర్థారణ చేస్తుంది. వైద్య సదుపాయం అందుబాటులో లేని పల్లెల్లోకి సులభంగా తీసుకెళ్లగలిగే ఈ స్టెతస్కోప్‌తో.. ఎందరో తల్లుల ప్రాణాలు కాపాడవచ్చని నిపుణులు చెబుతున్నారు.