calender_icon.png 30 April, 2025 | 11:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాప్ (ఆపద)లో ఇస్తారు.. దొరికినంత దొచేస్తారు

24-04-2025 01:13:30 AM

  1. యువతే లక్ష్యంగా చేసుకుంటున్న మోసగాళ్లు
  2. ఆఫర్లకు ఆశపడి యాప్‌లను ఆశ్రయిస్తున్న యువత
  3. రోజురోజుకు పెరుగుతున్న రుణయాప్‌ల ఆగడాలు
  4. రుణయాప్‌ల జోలికి వెళ్లొదంటున్న పోలీసులు

సూర్యాపేట, ఏప్రిల్23(సూర్యాపేట) : ఆన్లైన్ లోన్ యాప్ ల నిర్వాహకులు సామాన్య, మధ్యతరగతి కుటుంబాల అవసరాలను ఆసరాగా చేసుకుంటున్నారు. యువత లక్ష్యంగా రుణయాప్ లను రంగంలోకి దింపుతున్నారు. అవగాహన లేమితో రుణాలు పొందుతున్న వారంతా తీరా కట్టేటప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారి రుణం తీసుకొని కట్టేశాక కూడా వదిలిపెట్టకుండా...అడగకుండానే డబ్బులు ఖాతాకి పంపిస్తుంటారు.

ఇదేంటని అడిగితే మీరే రిక్వెస్ట్ పెట్టారంటూ గందరగోళానికి గురిచేసి రెట్టింపు డబ్బులు వచ్చేదాకా వేధిస్తూనే ఉంటారు. ఈ యాప్ లు  కుటుంబ కలహాలకు కారణమవుతున్నాయి.   ఇలాంటి యాప్ ల ద్వారా రుణాలు పొందిన ఇబ్బందులు పడుతున్నావారిలో కొందరు పోలీసులును ఆశ్రయిస్తుంటే.. కొందరు నేరుగా యాప్ నిర్వహకులతో సెటిల్ చేసుకుంటున్నారు. అయితే రుణయాప్ ల జోలిక వెళ్లకపోవడమే మంచిదని పోలీసులు తెలుపుతున్నారు. 

యువతే లక్ష్యంగా..

జిల్లా వ్యాప్తంగా రుణయాప్ ల నిర్వాహకులు యువతను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆన్లైన్ లో అధికంగా వాడే యాప్ లకు రుణయాపుల లింకులను పంపుతారు. సులభంగా లోన్ మంజూరు చేస్తామని, వాయిదా పద్దతుల్లో చెల్లించాలని చూపుతారు. ఇక రుణ మంజూరు చేశాక .. రుణం చెల్లించడంలో జాప్యం ఏర్పడినా, అడిగి నంత చెల్లించకపోయినా వేధింపులకు గురిచేస్తున్నారు.

సంక్షిప్త సందేశాలు పంపిస్తూ అసభ్యకరంగా దూషిస్తారు. చిత్రాలు మార్పింగ్ చేసి మోసగాడు .. దొంగ అంటూ సామాజిక మాధ్యమాల్లో పెడుతారు. ఫోన్ కాంటాక్టుల్లోని నంబర్లకు రుణం తీసుకుని చెల్లించడం లేదని మేసేజ్ లు పంపించి పరువు బజారుకీడుస్తారు. 

ఎరవేసి.. ఆపై దోచేసి

సైబర్ మోసాలా మాదిరి రుణ యాప్ నిర్వా హకులు ఆకర్షణీయమైన ప్రకటనలతో ఏమార్చుతున్నారు. ఎలాంటి ఆధారాలు అవసరం లేదని, అడిగినంత ఇస్తామని, విడతల వారీగా కట్టొచ్చని .. ఇలా రకరకాలుగా ఎరవేస్తుంటారు. యాప్ డౌన్ లోడ్‌ౌ ఉచితమని నమ్మబలికి తర్వాత అసలు కథ నడిపిస్తారు . ఫోన్ కాంటాక్టులు, గ్యాలరీ ఫొటోలు ఇతర వివరాలన్ని అనుసంధానం చేస్తారు. అలా రుణం పొందిన వారి పూర్తి వివరాలను నిర్వాహకులు తమ గుప్పిట్లోకి తీసుకుంటున్నారు.

90శాతం అనుమతి లేనివే..

రుణయాప్ బాధితులు ఫిర్యాదు చేస్తే ఐటీ చట్టంలో చీటింగ్ కేసు కింద నమోదు చేస్తారు. యాప్ ఎక్కడి నుంచి నిర్వహిస్తున్నారు, దానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఉందా .. లేదా .. అనేది చూస్తారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం రుణం తీసుకుంటే చెల్లించేందుకు 60 రోజుల గడువు ఉంటుంది.

అంతలోపే అడుగుతున్నాయంటే అవి కచ్చితంగా వేధించే యాప్ అని నిర్ధారణ చేసుకోవాలి . దాదాపు 90 శాతం యాప్లకు  ఆర్బీఐ నుంచి ఎలాంటి అనుమతులు ఉండవు. రాష్ట్ర పోలీస్ శాఖ పరిశోధించిన ప్రకారం చాలా యాప్లు  చైనా నుంచి వస్తున్నట్లు గుర్తించారు. ఈ నిర్వాహకులను పట్టుకోవడం చాలా కష్టం. 

ఆన్‌లైన్‌లోతరచూ వాడుతున్న రుణయాప్లు .. 

యూపీఏ లోన్, ఫస్ట్ క్యాష్, రిచ్లోన్, నాన్రూపీ , శార్స్ లోన్ , స్కైలోన్ , లైవ్ క్యాష్ , రూపీ బాక్స్ , ఎక్స్ ప్రెస్లోన్ , క్యాష్ డ్వాన్స్ , హలోరూపీ , హ్యాండ్ క్యాష్ , ఐక్రెడిట్, భారత్ క్యాష్, స్మార్ట్ కాయిన్, ఈజీ లోన్ , సిల్వర్ ప్యాకెట్, క్యాష్ క్యారీ లోన్ ఇలా అనేక రుణయాప్లు గుగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉంటున్నాయి.

రుణయాప్ల జోలికి వెళ్లకపోవడమే మంచిది.. 

సెల్పోన్ లలో వచ్చే అనవసరమైన సందేశాలకు స్పందించవొద్దు . ఫోన్ చేసి తాము రుణాలిస్తామంటూ నమ్మించేవారి మాటలు నమ్మి వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దు . రుణయాప్ల  జోలికి అసలు వెళ్లొద్దు. ఒకవేళ వెళ్లినా వాటికి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అనుమతి ఉందా ..

అని చెక్ చేసుకోవాలి. ఆకర్షణీయమైన ప్రకటనల లింక్ లు నొక్కితే మనకు తెలియకుండానే పూర్తివివరాలు ఆగంతకుల చేతుల్లోకి వెళ్లిపోతాయి . ఎలాంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే పోలీసులను సంప్రదించాలి. 1930 టోల్ ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేయవచ్చు.

 నరసింహ, జిల్లా ఎస్పీ,సూర్యాపేట