16-03-2025 01:26:46 AM
ఎల్బీనగర్, మార్చి 15 : జీవో నంబరు 118 పేరుతో పనికిరాని కాగితాన్ని చేతులో పెట్టి బీఎన్‌రెడ్డి నగర్ వాసులను మోసం చేశారని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ విమర్శించారు. బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్‌లోని ఫేజ్ ఉన్న హెచ్‌ఎండీఏ పార్క్, బీఎన్‌రెడ్డి నగర్ ఆడిటోరియం వద్ద పార్కును శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆడిటోరియంలో కాలనీవాసులతో సమావేశమయ్యారు.
కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. జీవో118 ద్వారా తాము మోసపోయామని, భూ ఆక్రమణదారులుగా తమ ను చూపిస్తూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం తమకు కన్వీనియన్స్ డీడ్ అందజేసిందన్నారు. భవనాల రెగ్యులరైజేషన్ అని చెప్పి, ఖాళీ స్థలాలను రెగ్యులరైజ్ చేశారని.. దీంతో తమ భవనాలకు విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మధుయాష్కీ మాట్లాడుతూ.. చట్టపకారం 118 జీవో ఎక్కడా చెల్లదన్నారు.
మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి హడావుడిగా జీవో 118 తీసుకొచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి, కలెక్టర్‌తో ఇప్పటికే ఈ విషయంపై మాట్లాడినట్టు చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్‌రెడ్డి, బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సదాశివుడు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అశోక్‌గౌడ్, రామారావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.